పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్హింద్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని మాధోపూర్ చౌకీ సమీపంలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తొలుత రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజన్ బోల్తా పడి, ప్యాసింజర్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులను యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన వికాస్ కుమార్ (37), హిమాన్షు కుమార్ (31)గా గుర్తించారు. వారిని 108 అంబులెన్స్‌లో ఫతేఘర్ సాహిబ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని రాజింద్ర ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని డాక్టర్ ఈవెన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. హిమాన్షు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Punjab: Two goods trains collided near Madhopur in Sirhind earlier this morning, injuring two loco pilots who have been admitted to Sri Fatehgarh Sahib Civil Hospital. pic.twitter.com/0bLi33hLtS
— ANI (@ANI) June 2, 2024
ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైళ్ల కోసం నిర్మించిన న్యూ సిర్హింద్ స్టేషన్ సమీపంలోని డీఎప్‌సీసీ ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గంలో అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు గూడ్స్ రైళ్లను నిలిపి ఉంచారు. అయితే ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజిన్ విడిపోయి మరో గూడ్సును ఢీకొంది. తరువాత అది అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలును ఢీకొంది.
దీంతో ఆ రైలులోని ప్రయాణికులు ఆందోళనతో కేకలు వేశారు. వెంటనే రైలు నిలిచిపోవడంతో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ఈ ఘటన నేపధ్యంలో అంబాలా నుంచి లూథియానా వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అంబాలా డివిజన్ డీఆర్‌ఎంతోపాటు రైల్వే, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment