ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్‌పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.
ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్‌పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్‌ను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్‌కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.
ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్‌సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాశ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. సూరత్‌గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్‌లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
Comments
Please login to add a commentAdd a comment