పెళ్లి చేసుకున్న వెంకీ అయ్యర్ (PC: Mufaddal Vohra X)
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.
కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.
టీమిండియా తరఫున అరంగేట్రం
భారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
తన అంతర్జాతీయ కెరీర్‌లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.
రాణించలేక అవకాశాలు కరువు
కానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.
ఐపీఎల్-2024 ఫైనల్‌లో అదరగొట్టి
ముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్.
అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment