చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్‌ఎల్‌సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.
దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.
యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్‌ను ‘థింకో ఎల్‌ఎల్‌సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
బీపీ చెకింగ్ స్మార్ట్‌వాచీలు..
జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్‌ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.
మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!
ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
Comments
Please login to add a commentAdd a comment