ల్యాబ్‌ తయారీ మాంసం తింటారా? | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ తయారీ మాంసం తింటారా?

Published Mon, Apr 8 2024 7:35 AM

Lab-grown meat could be the future of food - Sakshi

‘మీరు ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం తింటారా?’ కన్జూమర్‌ ఇన్‌సైట్స్‌ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ఇటీవల వివిధ దేశాల ప్రజల్ని అడిగిన వెరైటీ ప్రశ్న ఇది. మామూలు మాంసాన్ని లొట్టలేసుకొని ఆరగించే నాన్‌వెజ్‌ ప్రియులకు ఈ ప్రశ్న పెద్దగా రుచించనట్లుంది!! అందుకే చాలా తక్కువ మంది నుంచే సానుకూల స్పందన వచ్చింది. కానీ ఇందులోనూ భారతీయులే కొంత పాజిటివ్‌గా స్పందించడం విశేషం. 

భారత్‌ నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు... అంటే అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్‌ మాంసం తినేందుకు సై అనగా ఫ్రాన్స్‌లో మాత్రం అతితక్కువగా కేవలం 9 శాతం మందే దీన్ని ట్రై చేస్తామన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ల్యాబ్‌ తయారీ మాంసం విక్రయాలకు అనుమతిచ్చిన రెండు దేశాల్లో ఒకటైన అమెరికాలోనూ (మరో దేశం సింగపూర్‌) దీన్ని తినడంపై పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 16 శాతం మంది అమెరికన్లే ఇందుకు రెడీ అన్నారు. ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి 2 వేల నుంచి 10 వేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు.

ఎలా తయారు చేస్తారు?
కల్టివేటెడ్‌ లేదా కల్చర్డ్‌ మీట్‌గా పేర్కొనే ఈ మాంసం తయారీ కోసం ముందుగా జంతువుల నుంచి కొన్ని స్టెమ్‌ సెల్స్‌ (మూల కణాలు)ను బయాప్సీ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ‘పోషక స్నానం’ చేయిస్తారు. అంటే కణ విభజన జరిగి అవి కొంత మేర రెట్టింపయ్యేందుకు వీలుగా పోషకాలతో కూడిన ద్రవంలో ముంచుతారు. అనంతరం అవి కణజాలం (టిష్యూ)గా వృద్ధి చెందేందుకు బయోరియాక్టర్‌లోకి చేరుస్తారు. జంతు ప్రేమికుల కోసం లేదా జంతు వధ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ల్యాబ్‌ తయారీ మాంసం సూత్రప్రాయంగా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Advertisement