Sakshi News home page

మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం

Published Tue, Jun 20 2023 12:42 PM

- - Sakshi

సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి.

మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్‌లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్‌ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు.

రుచిలో మిన్న.. గోదారి చేప
నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్‌ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు.

ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు.

లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు
► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి.

► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు.

► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్‌ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది.

► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్‌ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

► టైప్‌–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి.

► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు.

► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు.

చేపలు.. కోకొల్లలు
మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి.

Advertisement
Advertisement