మే 3న అమెరికాలో జరిగే స్థానిక పాలనలో మహిళా సాధికారతపై ప్రసంగించాలని పిలుపు
భారత్ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులకే అవకాశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది.
మే 1వ తేదీన ఆమె న్యూయార్క్‌కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్‌లో పేకేరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‌గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది.
మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్‌పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్‌లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్‌కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు.
జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు
ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్‌ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment