ఒక్క సీటుతో కింగ్‌మేకర్‌.. కూటమిలతో తగ్గిన విజయకాంత్‌ క్రేజ్‌ | Sakshi
Sakshi News home page

ఒక్క సీటుతో కింగ్‌మేకర్‌.. కూటమిలతో తగ్గిన విజయకాంత్‌ క్రేజ్‌

Published Thu, Dec 28 2023 1:24 PM

DMDK Vijayakanth Political Journey In Tamil Nadu - Sakshi

కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్‌ 28)  తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.  ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.

విజయకాంత్‌ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు  చాలా భాషల్లో డబ్బ్‌ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్‌ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్‌ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం.

ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 
2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్‌ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు  సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది.  2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్‌ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి.

కూటమిల పేరుతో నష్టం
2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన  ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్‌ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది.  2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్‌ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్‌ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు.

ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్‌ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్‌ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ‍్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది.

చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement