అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు అడ్డుకట్ట వేయండి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా
ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో సమీక్ష
అమరావతి: పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. ఆయన గురువారం డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్‌కు 72 గంటల ముందు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న మూడురోజులు అత్యంత కీలకమైనవని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.
ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలని చెప్పారు. షాడో ఏరియాలో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.
పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా షామియాలు వేయడంతోపాటు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుని పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్‌సింగ్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, అదనపు ఈసీవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment