అత్యంత సమస్యాత్మకమైన 12,438 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు 438 మందికి పోలీసుల అదనపు రక్షణ
ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో 4.14 కోట్లకు చేరిన ఓటర్లు
ఇందులో పురుషులు 2.03 కోట్లు, మహిళలు 2.10 కోట్లు
జనవరిలో తుదిసవరణ ఓటర్ల జాబితా తర్వాత 5.94 లక్షలు పెరిగిన ఓటర్లు
దీంతో 46,389కి పెరిగిన పోలింగ్ స్టేషన్లు
ఇప్పటివరకు రూ.203.80 కోట్ల నగదు, వస్తువుల జప్తు
జనసేన పోటీచేస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు రద్దు
విశాఖ లోక్‌సభ, మంగళగిరి, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో
మూడుకంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్ల వినియోగం
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
పెన్షన్లను సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమన్నాం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.
అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య
రాష్ట్రంలో లోక్‌సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు.
15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్‌సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు.
అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు.
పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించం
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు.
వీళ్లు ఓటు వేసేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్‌కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు.
హోం ఓటింగ్‌ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్‌కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్‌కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్‌ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు.
హోమ్ ఓటింగ్‌ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment