#BJPManifesto: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల | Sakshi
Sakshi News home page

#BJPManifesto: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Published Sun, Apr 14 2024 9:36 AM

BJP Manifesto Released For Lok Sabha Election 2024 - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ రిలీజ్‌ చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు.

మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉత్తమ మేనిఫెస్టో తయారు చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు అభినందనలు. నేడు ఎంతో మంచి రోజు. పలు రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. యువత, పేద, మహిళ వర్గాలపై ఎంతో ఫోకస్‌ చేశాం. పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన చేపట్టాం. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. 

‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు.

పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధి మా లక్ష్యం. పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్  కనెక్షన్ ఇస్తాం. సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా విద్యుత్తు సరఫరా, ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం అందుతుంది. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఐదేళ్లపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తాము. చిల్లర వర్తకులకు గ్యారెంటీ లేకుండా 50 వేల రూపాయల రుణాలు. ముద్ర పథకం కింద 20 లక్షల రూపాయల రుణం పెంపు. 10 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం కొనసాగింపు. మూడు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఇల్లు నిర్మిస్తాం. తమిళ భాషకు విశ్వ వ్యాప్తి  కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. 

సంకల్ప్‌ పత్ర్‌లో 2025వ ఏడాదిని జన్‌జాతీయ గౌవర్‌ సంవత్సరంగా బీజేపీ పేర్కొంది. 

మేనిఫెస్టోలోని అంశాలు..
విశ్వబంధు, 
సురక్షిత భారత్‌, 
సమృద్ధ భారత్‌, 
సాంకేతిక వికాసం, 
సుస్థిర భారత్‌, 
గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, 
స్వచ్చ భారత్‌, 
అత్యుత్తమ శిక్షణ, 
క్రీడా వికాసం, 
సంతులిత అభివృద్ధి,  
ప్రపంచస్థాయి మౌలిక వసతులు, 
ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, 
సాంస్కృతిక వికాసం, 
సుపరిపాలన.

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోంది. సామాజిన న్యాయం కోసం అంబేద్కర్‌ పోరాడారు. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మా మేనిఫెస్టో ఆవిష్కరిస్తుంది. మేము ఏం చెప్పామో అది చేసి చూపించాం. త్రిపుల్‌ తలాక్‌ రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు చేశాం.. రామ మందిర నిర్మాణం ఇప్పుడు సాకారమైంది. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని అన్నారు. 

Advertisement
Advertisement