చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్‌

Published Wed, Apr 10 2024 8:54 PM

Ex Minister Perni Nani Comments On Chandrababu And Eenadu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలిందని.. మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారని మండిపడ్డారు. వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్ వేసిన పిటిషన్‌తో రామోజీ డొంకంతా కదిలింది. రోజూ పేపర్‌లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట. కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు. సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది. సీఎం జగన్‌ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు. దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు. కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ. టిప్పర్ డ్రైవర్‌కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు. రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్‌లో రాయడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

‘‘కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు. కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు. మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ. మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు. పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు. నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా?. వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా. ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా?. మార్గదర్శి మోసాలపై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా’’ అంటూ ధ్వజమెత్తారు.

‘‘అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు. చంద్రబాబు పదివేలు కాదు.. నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు.. వాలంటీర్లు నమ్మరు. ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. 

ఇదీ చదవండి: బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌: సీఎం జగన్‌


 

Advertisement
Advertisement