పాపం జన సైనికులు.. సినిమా ట్విస్ట్‌ ఇచ్చిన పవన్‌! | Sakshi
Sakshi News home page

పాపం జన సైనికులు.. సినిమా ట్విస్ట్‌ ఇచ్చిన పవన్‌!

Published Sun, Apr 7 2024 2:22 PM

Janasena Pawan Kayan Cheap Politics In AP - Sakshi

జనసేన పార్టీ పెట్టగానే ఓ కొత్త రాజకీయ పార్టీ వచ్చింది కదా అని ఔత్సాహిక యువత కొంత ఉత్సాహపడింది. పైగా అది ప్రశ్నించడానికే అని చెప్పడంతో నిజమే కాబోలు అనుకున్నారు. అయితే, పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వందేళ్ల పార్టీలో ఉన్నన్ని అవలక్షణాలన్నీ ఒక్క జనసేనలోనే ఉన్నాయి. ప్రత్యేకించి పార్టీ నాయకుడే పార్టీకి భవిత లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కార్యకర్తలకు అర్దం అవుతోంది. అందుకే వారు ఇపుడు ఈ పార్టీలోకి ఎందుకొచ్చామా అని తలలు బాదుకుంటున్నారు.

ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక విధానం ఉంటుంది. ఒక నినాదం ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏ నిర్ణయం అయినా పార్టీలోని  సహచర నేతలతో సమాలోచనలు చేసిన తర్వాతనే నాయకుడు ఒక ఆలోచనకు వస్తారు. కానీ, జనసేన పార్టీలో ఇటువంటి కసరత్తులు ఎన్నడూ కనపడవు. జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను జనసేనలోకి పంపింది ఎవరో పవన్‌కి తప్ప అందరికీ తెలుసు.

జనసేనలో ఉంటూ నాదెండ్ల మనోహర్‌ ఏం చేస్తూ ఉంటారో.. ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు. జనసేనలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో నాదెండ్లే డిసైడ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ, అసలు నిజం ఏంటంటే  దాన్ని డిసైడ్ చేసేది చంద్రబాబే. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని గద్దె దింపిన వైఎస్సార్‌సీపీ పార్టీపై బురదజల్లాల్సి వచ్చినపుడు పవన్‌కు స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయంటారు. ఉదాహరణకు ఏపీలో సీఎం జగన్ తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అద్భుతాలు చేస్తోంది. ఆ వ్యవస్థతో  రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై  అభిమానం మరింతగా పెరిగింది. ఏ  ఇంటికెళ్లినా.. ఏ అవ్వాతాతని కదిపినా వాలంటీరును ఆత్మబంధువులా చూస్తున్నారు. ఈ అనుబంధం ఇలానే కొనసాగితే ఇక విపక్షాలు రామ భజన చేసుకోవలసి వస్తుందని భయపడ్డ చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై తనకు తోచిన చెత్త విమర్శలు తాను చేశారు.

చంద్రబాబు ఏం మాట్లాడినా జనం నమ్మరు కాబట్టి.. చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని పవన్ చేత కూడా చెప్పిస్తూ ఉంటారు. వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు అదే చేశారు. బాబు ఆదేశించడం ఆలస్యం పవన్ కల్యాణ్ వాలంటీర్లపై రోత వాగుడు వాగారు. వాలంటీర్లు ఇళ్లల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారిని అసాంఘిక శక్తుల చేత కిడ్నాప్ చేయిస్తున్నారని చెత్త కామెంట్ చేశారు పవన్. పైగా దీనికి  కేంద్ర నిఘా బృందం ప్రతినిథులను అడ్డు పెట్టుకున్నారు. వారికి ఇంకో పని లేనట్లు.. ఏ చట్ట సభలోనూ సభ్యత్వంలేని పవన్ చెవిలో వాలంటీర్ల గురించి ఊదారట. అది జనం నమ్మాలట. ఇంతకీ పవన్ వదరుబోతు తనాన్ని ఒక్కసారి ఆలకించండి.

వాలంటీర్లపై చంద్రబాబుకు కోపం ఉంది కాబట్టి.. జనసేనకు చంద్రబాబు కిరాయి కడుతున్నారు కాబట్టి.. తాను కూడా వాలంటీర్లను వ్యతిరేకించాల్సిందేనని పవన్ అనుకుంటున్నట్లుంది. తాజాగా ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లు పింఛన్లు అందించడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ ఒక ప్లాన్ చేశారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. దాంతో  ఎన్నికలు అయ్యే వరకు పింఛన్లే కాదు ఎటువంటి సంక్షేమ పథాకాలను వాలంటీర్ల చేత ఇప్పించడానికి వీల్లేదని ఈసీ ఆంక్షలు విధించింది. దీన్ని చంద్రబాబు, పవన్‌లు తమ విజయంగా భావించారు. ఈ ఆంక్షలతో 66 లక్షల మంది పెన్షన్‌దార్లు ఇబ్బందులుపడ్డారు. మండుటెండల్లో  తిరిగి చంద్రబాబు నాయుడి పాలన రోజుల మాదిరిగా వృద్ధులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన దుర్గతి పట్టింది. ఇది వారిని క్షోభకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో  ఈ పేద ప్రజలే విపక్షాలకు గుణపాఠం చెబుతారని పాలక పక్ష నేతలు అంటున్నారు.

చంద్రబాబు విధానాలే పవన్‌కు శిరోధార్యాలు. చంద్రబాబు ఆలోచనలే పవన్‌కు సూచనలు. టీడీపీని కాపాడటమే జనసేన అజెండాగా పవన్ నడుచుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన కోసం మొదట్నుంచీ కష్టపడ్డ వారిని సైతం పవన్ నట్టేట ముంచారు. జనసేన అధికారంలోకి రావాలని కానీ.. వస్తుందని కానీ పవన్ కల్యాణ్ అనడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదంటున్నారు. చంద్రబాబును సీఎం సీటు ఎక్కించాలని ఆరాట పడుతున్నారు. ఈక్రమంలో తన మేలు కోరిన కాపు నేతలను సైతం పవన్ అవమానించి పంపారు. జనసేన భవిత కోసం కాపు మేథావులు ఇచ్చిన సూచనలు సలహాలను బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు పల్లకి మోయడానికి తానే ఒక బోయీ అయ్యారు. అదే జనసేన అజెండాగా మార్చుకున్నారు.

Advertisement
Advertisement