ఒట్టేసి చెబుతున్నా..! రేవంత్‌ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ | Sakshi
Sakshi News home page

ఒట్టేసి చెబుతున్నా..! రేవంత్‌ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Published Wed, Apr 24 2024 4:49 AM

Revanth Interesting discussion in political on promise - Sakshi

రేవంత్‌ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ 

బాసర సరస్వతి, ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి, యాదాద్రి, భద్రాద్రి రామయ్య, సేవాలాల్‌ సాక్షిగా ఒట్లు 

ఆగస్టు 15 కల్లా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం 

హామీల అమల్లో విఫలం కావడం వల్లే దేవుళ్ల పేరిట ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటున్న విపక్షాలు 

విపక్షాల ప్రచారానికి కౌంటర్‌గా తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్‌ 

ఒట్లు పెడుతున్నారంటున్న కాంగ్రెస్‌ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా మంత్రివర్గం బాధ్యత. రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం..’. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఒక్క నిజామాబాద్‌లోనే కాదు..ఆదిలాబాద్‌ అయినా మహబూబాబాద్‌ అయినా, మహబూబ్‌నగర్‌ అయినా, మెదక్‌ అయినా, భువనగిరి అయినా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా రేవంత్‌ ఒట్లు మీద ఒట్లు పెడుతున్నారు.

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, భద్రాద్రి రామయ్యతో పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ సాక్షిగా అంటూ.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని నిత్యం విరుచుకుపడే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి.. ఏ దేవుడి దగ్గరకు వెళితే ఆ దేవుడు సాక్షి అంటూ ఒట్టేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.  

ఒట్టు మాటలు గట్టివేనా? 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న ఈ ‘ఒట్టు’మాటలు ఎంత గట్టివనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌ దేవుళ్ల సాక్షిగా ఎందుకు మాట ఇస్తున్నారనేది హాట్‌టాపిక్‌గా మారింది. రైతు రుణమాఫీ కేంద్రంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు అధికార పక్షంలోనూ చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైనందున రేవంత్‌రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఈ తరహాలో హామీ ఇవ్వడం ద్వారా వారిని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

అయితే అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్‌ ‘ఒట్టు’మాటలు మాట్లాడాల్సి వస్తోందని అంటోంది. రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, కరువు వచ్చి పడిందని, కరువును కూడా ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాగానే..ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, ఈలోపే తామేమీ చేయడం లేదన్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రేవంత్‌ ఘాటుగా స్పందిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంతో పాటు ప్రజలు ఆయన మాటలు విశ్వసించేలా చేసేందుకే ఆయన ఈ ఎత్తుగడ అమలు పరుస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు, మహిళలు, రైతులు, మైనార్టీల ఓట్లు రాబట్టుకునే వ్యూహంతోనే రేవంత్‌ ఈ తరహాలో ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి.  

కోమటిరెడ్డికి కితాబుపైనా చర్చ 
భువనగిరి ప్రచార సభలో మాట్లాడుతూ సీఎం అయ్యేందుకు మంత్రి కోమటిరెడ్డికి అన్ని అర్హతలున్నాయని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలోనే అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. భువనగిరి అభ్యర్థి, తన సన్నిహితుడు చామల కిరణ్‌రెడ్డిని గెలిపించుకోవడంలో భాగంగా అక్కడ మంచి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మచ్చిక చేసుకునేందుకే రేవంత్‌ అలా మాట్లాడారని కొందరంటుంటే... మరికొందరు మాత్రం రేవంత్‌ స్టైల్‌ ఆట నల్లగొండలో ఆడారని, ఆ జిల్లాకు చెందిన నేతలను డిఫెన్స్‌లో పడేసేలా ఆయన మాట్లాడారని కొందరంటున్నారు.

మరోవైపు బీజేపీ చేస్తున్న హిందూత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా దేవుడు, మతాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. పోలింగ్‌ బూత్‌లలో కాదు.. నేను హిందువునని గర్వపడతా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులను ఆదరిస్తా.. గౌరవిస్తా..’అంటూ చెప్పడం, హామీల అమలుకు దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.. ఎలాంటి ఫలితాలనిస్తుందోనన్న చర్చ జరుగుతోంది.  

వేడి రాజేసేలా రాజకీయ వ్యాఖ్యలు  
ఒట్ల మాటలు అలా ఉంటే... ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌ పదేపదే మరో విషయాన్ని నొక్కి చెబుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన, సమయం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక తనతో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశంపై దాడిని ఆయన మరింత తీవ్రతరం చేశారు. టచ్‌ చేసి చూడండి... మసై పోతారంటూ సినిమా డైలాగులు విసురుతున్నారు.

‘ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాపలా ఉంది రేవంత్‌రెడ్డి. నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డి కాదు. రేవంత్‌రెడ్డిని..’లాంటి పదునైన వ్యాఖ్యలతో సవాళ్లు విసురుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యల ద్వారా కేడర్‌లో ధైర్యాన్ని నింపడమే కాకుండా రాజకీయ వేడి పుట్టించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్‌ సానుకూలతను పెంచేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement