Sakshi News home page

పచ్చ పార్టీ ప్రలోభాలు

Published Fri, Mar 29 2024 4:38 AM

TDP leaders are transporting cash in large numbers - Sakshi

డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు

గ్రామస్థాయి నేతలకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు..

చోటా నేతలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు..

పార్టీలో చేరిన వారికి రూ.10వేల చొప్పున చెల్లింపులు

అదే మండలస్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆఫర్‌

అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు

బాపట్ల, వేమూరులోనూ ఇదే పరిస్థితి

ఓటర్లను నమ్మలేక నేతల కొనుగోలుకు సిద్ధపడిన వైనం

బాపట్ల టీడీపీ అభ్యర్థి వర్మ కంపెనీ కంటైనర్‌లో పట్టుబడ్డ రూ.56 లక్షల నగదు

ఆక్వా కంటైనర్ల మాటున పెద్దఎత్తున టీడీపీ నేతలు నగదు రవాణా!

సాక్షి ప్రతినిధి, బాపట్ల/చీరాల: రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇక తమకు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వెదజల్లి ప్రత్యర్థి పార్టీకి చెందిన చోటామోటా నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రామస్థాయి కార్యకర్తలకైతే రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోళ్ల వ్యవహారం వారం రోజులుగా ఊపందుకున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఘటనల బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే.. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రూ.56 లక్షల డబ్బు కట్టలను గురువారం ఆయన మెరైన్‌ కంపెనీకి చెందిన కంటైనర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతల అక్రమాలు నిజమేనని స్పష్టమవుతోంది.

అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో చెల్లింపులు..
ఇదిలా ఉంటే.. బాపట్ల నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా బలంలేని టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ కేవలం డబ్బు బలంతోనే టీడీపీ టికెట్‌ సంపాదించారని అందరికీ తెలిసిన విషయమే. ఆ బలంతోనే ఎన్నికల్లో నెగ్గేందుకు వర్మ సిద్ధమయ్యారు. కానీ, కొంతకాలంగా ఓటర్లకు చీరలు పంపిణీ చేసినా ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఆయన డబ్బు రాజకీయానికి తెరతీశారు.

గ్రామాల్లో ఉన్న చోటామోటా నేతలు, కార్యకర్తలను ప్రలోభపెట్టి డబ్బులు ముట్టజెప్పి కొనుగోళ్లకు తెరతీశారు. అధికార పార్టీలో పదవులున్న నేతకు రూ.10 లక్షలు, చోటా నేతకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గ్రామస్థాయిలో అయితే రూ.లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తున్నారు. పార్టీలో చేరిన వారికి రూ.పదివేలు చెల్లిస్తూ కండువాలు వేస్తున్నారు.

అదే అధికార పార్టీ నుంచి పచ్చ పార్టీలో చేరితే మండల స్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 నుంచి 30 లక్షల ఆఫర్‌ చేస్తున్నారు. అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపిన వేగేశన నరేంద్ర వర్మపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారపార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కొంతకాలంగా కంటైనర్ల ద్వారా తరలింపు?
రాయల్‌ మెరైన్‌ అధినేత నరేంద్రవర్మ గత ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతు­న్నారన్న ఆరోపణలకు ఈ కంటైనర్‌ వ్యవహారం బలం చేకూరుస్తోంది. కంటైనర్ల ద్వారా రొయ్యల బాక్సుల మధ్యలో డబ్బు తీసుకొస్తే ఎటువంటి అనుమానం రాదని, అందుకు పక్కా ప్లానుతో రాయల్‌ మెరైన్‌కు కంటైనర్‌ ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు అనుమా­నిస్తున్నారు.

ఇక ఆక్వా రంగంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు నడిపే టీడీపీ నాయకులు చాలామంది ద్వారా ఇదే విధంగా నగదు అక్రమ రవాణా జరుపుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అసలు పట్టుబడ్డ నగదును నేరుగా తెచ్చుకోవాలి. కానీ, కంటైనర్లలో రొయ్యల బాక్సులలో మధ్యలో పెట్టి రహస్యంగా తీసుకురావడమే అనుమానాలకు తావిస్తోంది.

ఇది ఒక్కసారి జరిగింది అయితే కాదని, ముందుగానే డబ్బును మెరైన్‌ కంపెనీలకు తరలించి అక్కడి నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా నరేంద్ర వర్మ ఒక్కరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగంలో ఉన్న టీడీపీ నేతల ద్వారా అక్రమమార్గాన విచ్చలవిడిగా నగదు రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

రొయ్యల బాక్సుల మధ్యలో నోట్ల కట్టలు..
ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రా­యల్‌ మెరైన్‌ కంపెనీకి నిజాంపట్నం నుంచి చీరా­ల పరిధిలోని ఈ సంస్థకు ఓ రొయ్యల కంటైనర్‌ చేరుకుంది. దీనికి సంబంధించి అప్పటికే సమా­చా­రం అందుకున్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్‌ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ రాయల్‌ మెరైన్‌ వద్ద కాపు కాశారు. వచ్చిన కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు­చేశారు.

కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవె­న్యూ, ఇన్‌కంటాక్స్, ట్రెజరీ అధికారులు గురు­వారం ఉ.11 గంటల సమయంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కంటైనర్‌లో అన్నీ రొయ్యల బాక్సులు ఉండగా, ఒక బాక్సులో మాత్రం రూ.500 నోట్లు 112 కట్టలతో మొత్తం రూ.56 లక్షలు దొరికాయి. దీంతో అధికారులు ఈ డబ్బు ఎక్కడ నుంచి తరలించారు, వీటికి సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని వి­చారణ చేస్తున్నారు.

ఎటువంటి పత్రాలు చూ­పిం­చకపోవడంతో డబ్బును ఐటీ అధికా­రులకు అప్ప­గించారు. మీడియా సహా ఎవరినీ ఆ కంపెనీలోకి అను­మతించకపోవడంతో డబ్బు కోట్లలోనే పట్టుబడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమ­వుతున్నాయి. ఈ డబ్బుతోనే వర్మ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఐటీ అధికారులు వర్మ సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టారు.  

Advertisement

What’s your opinion

Advertisement