నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్‌ | Sakshi
Sakshi News home page

నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్‌

Published Tue, Nov 21 2023 7:16 PM

Vivek Venkataswamy Sensational Comments On It Raids - Sakshi

సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో  గెలవలేకే తనపై  ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్‌ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంచిర్యాలలోని వివేక్‌ ఇంట్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు పదిగంటలకుపైగా జరిగి సాయంత్రం ముగిశాయి. అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన వివేక్‌ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్‌పై ఐటీ దాడులు జరిపే దమ్ము లేదు కానీ తనపై మాత్రం చేశారని ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తన మీద కుట్ర చేశాయని, తనపై ఎన్ని దాడులు చేసినా ఏం కాదన్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 80 సీట్లు గెలవబోతోందని, చెన్నూరు నుంచి తాను గెలవబోతున్నానని వివేక్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారని ఆరోపించారు. ఇటీవలే విశాఖ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో జమైన నగదు గురించి ఐటీ అధికారులు ఈ సోదాల్లో వివేక్‌ను ఆరా తీసినట్లు సమాచారం. కాగా, సోమాజీగూడలోని వివేక్‌ నివాసంలో ఐటీ సోదాలు ఉదయమే ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. 

ఇటీవలే వివేక్‌ వెంకటస్వామి బీజేపీని వీడి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తర్వాత వెంటనే ఆయనకు చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడిన కొద్ది రోజులకే  ఆయనపై ఐటీ దాడులు జరగడం ఆయన అనుచరులను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణలో పవర్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేయకుండా కాంగ్రెస్‌ నేతలపైనే ఐటీ దాడులు జరుగుతుండడాన్ని కాంగ్రెస్‌ నేతలు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఐటీ సోదాలు ముగిసిన వెంటనే వివేక్‌ కూడా ఇదే రకమైన స్టేట్‌మెంట్‌ ఇవ్వడం గమనార్హం. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్ర చేసి తనపై ఐటీ దాడులు చేయించాయని ఆరోపించారు. 

ఇదీచదవండి.. కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ఇంట్లో ఐటీ సోదాలు

Advertisement
Advertisement