జన హోరు.. జాతర జోరు | Sakshi
Sakshi News home page

జన హోరు.. జాతర జోరు

Published Sun, Apr 7 2024 7:15 AM

-

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ జనజాతరకు జనం పోటెత్తారు.. జై కాంగ్రెస్‌.. జై సోనియా, జై రాహుల్‌గాంధీ, జై రేవంత్‌రెడ్డి నినాదాలతో హోరెత్తించారు. ఇటు తుక్కుగూడ నుంచి శ్రీనగర్‌ ఈసిటీ ప్రధాన గేటు వరకు.. అటు పెద్ద గోల్కొండ నుంచి రావిర్యాల వరకు బారులు తీరారు. సభకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షత వహించగా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాన వేదికపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసీనులయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారంటీలను ప్రకటించి, అమలు చేస్తున్న కాంగ్రెస్‌.. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇదే వేదిక నుంచి ఐదు గ్యారంటీలను ప్రకటించి సెంటిమెంట్‌ను కొనసాగించింది. నేతల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపాయి. ఆశించినదానికంటే అధిక సంఖ్యలో జనం తరలిరావడం.. సక్సెస్‌ కావడంతో నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

అరగంట పాటు రాహుల్‌ ప్రసంగం..

సాయంత్రం 5.20 గంటలకే రాహుల్‌ శంషాబాద్‌ చేరుకోవాల్సి ఉండగా 6.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా తుక్కుగూడ ఎగ్జిట్‌ 14 నుంచి రాత్రి 7.7 గంటలకు రాజీవ్‌గాంధీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ర్యాంపుపై నడుస్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు. రాత్రి 7.16 గంటలకు పార్టీ జాతీయ ఐదు గ్యారంటీల హామీ పత్రాలను ఆవిష్కరించారు. రాత్రి 7.20 గంటలకు మొదలు పెట్టి 35 నిమిషాల పాటు ప్రసంగించారు.

మండుటెండలో..

మధ్యాహ్నం 2 గంటల నుంచే పార్టీ కార్యకర్తలు సభాప్రాంగణానికి చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చారు. నిలువ నీడ లేకపోవడం, టెంట్లు ఏర్పాటు చేయక పోవడం, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, మహేశ్వరం సీనియర్‌ లీడర్‌ దేపా భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తుక్కుగూడ సభ సక్సెస్‌

భారీగా తరలివచ్చిన అభిమానులు

నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం

ఉత్సాహం నింపిన నేతల ప్రసంగాలు

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌

Advertisement
Advertisement