Sakshi News home page

స్టార్‌ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్‌ బోర్డు.. రెండేళ్ల నిషేధం! ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ

Published Tue, Dec 26 2023 10:07 AM

Afghanistan Ban Naveen Fazalhaq Mujeeb From Playing Franchise Cricket For 2 Years - Sakshi

Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్‌ బౌలర్లు నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌హక్‌ ఫారూకీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మమాన్‌లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. 

అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్‌ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్‌, ఫారూకీ, ముజీబ్‌.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. 

ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్‌, ఫారూకీ, ముజీబ్‌ సెంట్రల్‌ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది.

ఐపీఎల్‌ జట్లకు ఎదురుదెబ్బ
అఫ్గన్‌ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ను కేకేఆర్‌.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.

మరోవైపు.. ఐపీఎల్‌-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్‌ చేసుకుంది. 2023 సీజన్‌లో నవీన్‌.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 

ఇక సీమర్‌ ఫజల్‌హక్‌ ఫారూకీని ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్‌ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. 

దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు
సౌతాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్‌ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్‌ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు.

ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్‌ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది.

నో ఆబ్జక్షన్‌ లెటర్‌ ఇచ్చేదే లేదు
వచ్చే ఏడాది వారికి సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, ఫజల్‌హక్‌ ఫారూకీ, నవీన్‌ ఉల్‌ హక్‌ మురీద్‌ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

వరల్డ్‌కప్‌-2023లో మెరుగైన ప్రదర్శన
అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌ అంచనాలకు మించి రాణించింది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్‌ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.  

చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్‌ శర్మ క్లారిటీ!

Advertisement

What’s your opinion

Advertisement