Sakshi News home page

Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్‌ రాహుల్‌.. కారణం ఇదే!

Published Wed, Feb 28 2024 9:58 AM

Ind vs Eng: KL Rahul Flies to London Uncertain for 5th Test: Reports - Sakshi

India vs England Test Series 2024: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ పూర్తిగా కోలుకోనట్లు సమాచారం. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకు కూడా అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆడిన కేఎల్‌ రాహుల్‌.. మెరుగైన ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 108 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా తొడకండరాలు పట్టేడయడంతో జట్టుకు దూరమయ్యాడు.

ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. ధర్మశాల వేదికగా జరుగనున్న ఆఖరి మ్యాచ్‌లోనైనా అతడు మైదానంలో దిగుతాడని భావించగా.. గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుపట్టడం లేదని... ఈ నేపథ్యంలో అతడిని లండన్‌కు పంపించేందుకు బోర్డు సిద్ధమైనట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. అక్కడి వైద్య నిపుణుల  వద్ద ఈ కర్ణాటక బ్యాటర్‌ చికిత్స పొందనున్నట్లు సమాచారం.

తొడ కండరాల నొప్పితో బాధ
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత మూడు టెస్టులకు రాహుల్‌ అందుబాటులో ఉంటాడనే అనుకున్నాం. అయితే, తాను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రాహుల్‌ చెప్పాడు.

నిజానికి వరల్డ్‌కప్‌2023, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో వికెట్‌ కీపింగ్‌ కారణంగా అతడిపై పనిభారం ఎక్కువైంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. రాహుల్‌ తాజా మెడికల్‌ రిపోర్టును ఇంగ్లండ్‌లో అతడికి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్‌కు పంపించారు.

ఈ క్రమంలో అతడిని ఇంగ్లండ్‌కు రావాలని, నేరుగా చెకప్‌ చేసిన తర్వాతే అసలు సమస్య ఏమిటో తెలుసుకోవచ్చని సదరు డాక్టర్‌ రాహుల్‌కు చెప్పారు’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రాహుల్‌ ఫిట్‌నెస్‌పై మార్చి 2 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 3-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: అలాంటి వాళ్లను జట్టులోకి తీసుకోం: రోహిత్‌ అసహనం

Advertisement

What’s your opinion

Advertisement