Sakshi News home page

Rohit Sharma On India Loss: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం

Published Thu, Dec 28 2023 9:39 PM

Ind vs SA 1st Test Rohit On Loss We Didnt Bat Well And Our Bowlers - Sakshi

Ind Vs SA 1st Test 2023- Rohit Sharma Comments On Loss: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే పరాజయం పాలైనట్లు పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తాము ఆడలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.

అయితే, తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ అసాధారణ పోరాటం చేశాడని.. అయినప్పటికీ తిరిగి పుంజుకునే అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని రోహిత్‌ వాపోయాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్‌ సేనకు ఆతిథ్య జట్టు గట్టి షాకిచ్చింది.

టీమిండియా ఘోర పరాజయం
సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్‌ మీద 32 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఈ మేరకు.. ‘‘గెలుపు దిశగా మా ఆట తీరు సాగలేదు. కేఎల్‌ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మాకు అవకాశాలు సృష్టించాడు.

మా బ్యాటింగ్‌ చెత్తగా సాగింది
కానీ మేము వాటిని ఉపయోగించుకోలేకపోయాం. ఈరోజు మా​ బ్యాటింగ్‌ చెత్తగా సాగింది. టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించాలి. కానీ ఈరోజు మేము అది చేయలేకపోయాం.

ఇక్కడికి వచ్చే ముందే ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయం మీద అందరు ఆటగాళ్లకు అవగాహన ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు మా బ్యాటర్లకు అనుక్షణం సవాల్‌ విసిరారు.

అందుకే ఓడిపోయాం
అయితే, మేము వారిపై పైచేయి సాధించలేకపోయాం. ఇది బౌండరీ స్కోరింగ్‌ గ్రౌండ్‌. సౌతాఫ్రికా బ్యాటర్లు బ్యాటింగ్‌ చేసినపుడు వారు అనేకసార్లు ఫోర్లు బాదారు. కానీ మేము అలా చేయలేకపోయాం.

అందుకే ఓటమిని మూటగట్టుకున్నాం. ప్రత్యర్థి జట్టు బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఏదేమైనా మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసేందుకు మేము ఆస్కారం ఇవ్వడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. రెండు ఇన్నింగ్స్‌లోనూ మా బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. 

మా బౌలర్లలో చాలా మందికి ఇదే తొలిసారి
మా బౌలర్లలో చాలా మంది ఇప్పుడే మొదటిసారిగా సౌతాఫ్రికా పర్యటనకు వచ్చారు. అయినా, ఓటమికి సాకులు వెదకాలనుకోవడం లేదు. మళ్లీ తిరిగి పుంజుకుని తదుపరి మ్యాచ్‌ మీద దృష్టి పెడతాం’’ అని రోహిత్‌ శర్మ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీ(101) సాధించాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో అతడు నాలుగు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఇక మరో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులతో టాప్‌​ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత 5 పరుగులకే పరిమితమైన అతడు.. గురువారం నాటి ఆటలో డకౌట్‌గా వెనుదిరిగాడు.

సౌతాఫ్రికా వర్సెస్‌ టీమిండియా తొలి టెస్టు స్కోర్లు: 
►టాస్‌: సౌతాఫ్రికా- తొలుత బౌలింగ్‌
►టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌
►సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 408 ఆలౌట్‌.. 163 పరుగుల ఆధిక్యం
►టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 131 ఆలౌట్‌
►ఇన్నింగ్స్‌ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డీన్‌ ఎల్గర్‌(185 పరుగులు)
►ఇరు జట్ల మధ్య రెండో టెస్టు: జనవరి 3 నుంచి ఆరంభం.

చదవండి: Ind W vs Aus W: ‘టీమిండియాకు మరో నయా ఫినిషర్‌’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌.. కానీ

Advertisement

What’s your opinion

Advertisement