Sakshi News home page

KL Rahul: అక్కడే ఓ ఫ్లాట్‌ కొనుక్కుంటే బెటర్‌.. పేలుతున్న సెటైర్లు

Published Thu, Feb 29 2024 5:02 PM

KL Rahul Ruled Out Of IND vs ENG 5th Test Fans Reacts Should Buy Flat in NCA - Sakshi

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు కూడా టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ధ్రువీకరించింది. ధర్మశాల టెస్టుకు తాజాగా జట్టును ప్రకటించిన సందర్భంగా.. ‘‘ఫిట్‌నెస్‌ సాధిస్తే కేఎల్‌ రాహుల్‌ను ఐదో టెస్టులో ఆడించాలనుకున్నాం.

కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడు జట్టుకు దూరమయ్యాడు. రాహుల్‌ సమస్య గురించి బీసీసీఐ వైద్య బృందం లండన్‌లో ఉన్న నిపుణులతో ఎప్పుటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది’’ అని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌పై నెట్టింట సైటైర్లు పేలుతున్నాయి. ‘‘ఆటలో నిలకడలేని క్రికెటర్లు ఉంటారు. ​కానీ రాహుల్‌ విషయంలో మాత్రం ఫిట్‌నెస్‌లో నిలకడ లేదు. గాయపడతాడు. కోలుకుంటాడు.

కొన్ని రన్స్‌ స్కోరు చేస్తాడు. మళ్లీ గాయపడతాడు. గత కొన్నేళ్లుగా ఇదే రిపీట్‌ అవుతోంది. కుర్రాళ్లు దూసుకువస్తుంటే రాహుల్‌ మాత్రం ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

అదేంటో ఐపీఎల్‌ సమయంలో మాత్రం బాగానే ఉంటాడు’’ అని కొంతమంది నెటిజన్లు రాహుల్‌ను విమర్శిస్తున్నారు. మరికొందరేమో.. ‘‘జాతీయ క్రికెట్‌ అకాడమీలో తరచూ పునరావాసం పొందే క్రికెటర్లలో రాహుల్‌ ఒకడు. అక్కడ తను ప్రత్యేకంగా ఓ ఫ్లాట్‌ కొనుక్కుంటే సరిపోతుంది’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథి రాహుల్‌.. తొడ కండరాల నొప్పితో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత మైదానంలో దిగినా తరచూ గాయాల బారిన పడుతూనే ఉన్నాడు.

తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆడిన అతడికి గాయం తిరగబెట్టింది. ఫలితంగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 3-1తో గెలిచిన టీమిండియా.. మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది.

ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టుకు భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్‌), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొమమ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

చదవండి: హార్దిక్‌కు రూల్స్‌ వర్తించవా.. పాపం ఇషాన్‌, శ్రేయస్‌: మండిపడ్డ ఇర్ఫాన్‌ 

Advertisement

What’s your opinion

Advertisement