ధనాధన్‌ ధోని కథ వేరు.. అందుకే కాస్త ముందుగానే: డేల్‌ స్టెయిన్‌ | Sakshi
Sakshi News home page

ధనాధన్‌ ధోని కథ వేరు.. అందుకే కాస్త ముందుగానే: డేల్‌ స్టెయిన్‌

Published Fri, Apr 19 2024 5:52 PM

My Girlfriend Says That My TV Is Broken: Dale Steyn On Dhoni IPL Impact - Sakshi

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీసీ టైటిళ్ల(3) వీరుడికి ఫ్యాన్స్‌ ఉన్నారు. 

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడుతూ అభిమానుల అలరిస్తున్న తలా.. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు. వింటేజ్‌ ధోనిని గుర్తుచేస్తూ ఐపీఎల్‌-2024లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు.

నిజానికి ధోనిని చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తుండగా.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అందులో నేనూ ఒకడినే అంటున్నాడు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.

‘‘ఐపీఎల్‌తో ఇక్కడ మాత్రమే కాదు.. సౌతాఫ్రికాలో నాలాంటి ఎంతో మందికి ఎనలేని సంతోషాన్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను టీవీ ఎక్కువగా చూడను. అయితే, ఐపీఎల్‌ సమయంలో మాత్రం సీటుకు అతుక్కుపోయి మరీ కళ్లప్పగించి చూస్తుంటా.

కానీ నా గర్ల్‌ఫ్రెండ్‌ టీవీ పగిలిపోతుందని అంటూ ఉంటుంది. ఎందుకంటూ ఎప్పుడూ అది.. ఐపీఎల్‌కు స్టక్‌ అయిపోయింది ఉంటుందిలెండి. ఎంఎస్‌ షాట్లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నా. ఓ అభిమానిగా ఆ కోణంలోనే ధోని ఆటను చూస్తున్నా. అతడు కొట్టే ప్రతీ షాట్‌ను ఆస్వాదిస్తున్నా.

నిజం చెప్తున్నా తన ఇన్నింగ్స్‌ చూసినప్పుడల్లా నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. కాబట్టి ధోనిని మిడిలార్డర్‌లో తీసుకువస్తే ఇంకా బాగుంటుంది కదా’’ అని స్టెయిన్‌ గన్‌ డేల్‌ స్టెయిన్‌ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో చెన్నై శుక్రవారం నాటి మ్యాచ్‌ నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఇక స్టెయిన్‌ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న ధోని ఫ్యాన్స్‌.. ‘‘మా మనసులోని మాట నువ్వు చెప్పావు.. తలా ఫినిషర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వస్తే మరిన్ని మెరుపులు చూడవచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే, అదే సమయంలో ధోని మోకాలి నొప్పిని గుర్తుచేసుకంటూ .. ‘‘తలా అలా క్రీజులోకి వచ్చి ఒక్క షాట్‌ ఆడినా సంతోషమే. తను బాగుండటమే ముఖ్యం’’ అని సర్దిచెప్పుకొంటున్నారు.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ధోని.. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చి 4 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. సీఎస్‌కే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
 

Advertisement
Advertisement