
వెలిచాల రాజేందర్‌కు ఎంపీ టికెట్ రావడానికి ప్రభాకర్‌రావే కారకుడు
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ఇచ్చిన డబ్బు
కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీకి ముట్టాయి
దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అవసరమైతే ఎన్‌ఐఏకు అప్పగించాలి
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్‌రావు.. రాజేందర్‌కు కాంగ్రెస్‌కు సంబంధం లేదు. ఆయన కార్యకర్త కానేకాదు..ఏనాడూ ఉద్యమాల్లో పాల్గొనలేదు’అని బీజేపీ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘అసెంబ్లీ ఎన్నికల నుంచే రాజేందర్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్‌రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు. కరీంనగర్ ఎంపీ టికెట్ వేరొకరు ఆశించినా, ఆయనకు సీఎం పూర్తి మద్దతు ఇచ్చినా, ఈ తతంగం నడపడం వల్లే ఆయనకు టికెట్ రాలేదు.
ఇదంతా కేసీఆర్‌తో జిల్లా మంత్రి కుమ్కక్కై సాగించిన కుట్ర ఇది. అసలు కథ ఏంటంటే ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నారు. అమెరికాలోని అశోక్‌రావు కూతురు ఇంట్లోనే ప్రభాకర్‌రావు ఉంటున్నాడు. అమెరికా, దుబాయ్ వెళ్లొస్తున్నాడు. మరో 10 ఏళ్లపాటు వీసా ఉంది. ప్రభాకర్‌రావు ఇండియాకు తిరిగొచ్చేలా చర్యలెందుకు తీసుకోవడం లేదు. అమెరికా నుంచి తిరిగి రావొద్దనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ప్రభాకర్‌రావు వస్తే సిరిసిల్లలో కేటీఆర్ కనుసన్నల్లో జరిగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటై నన్ను ఓడించే కుట్ర
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్కక్కు అయ్యి ఫోన్‌ట్యాపింగ్ కేసును నీరుగార్చడంతోపాటు..ఈ రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్‌లో నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసును సమగ్ర విచారణ నిమిత్తం సీబీఐకి, అవసరమైతే ఎన్‌ఐఏకు కూడా అప్పగించాలి. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్‌లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. వారిచ్చే సలహా, సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పని చేస్తున్నరు. ఒక అధికారి నా వద్దకు వచ్చి నాతోపాటు మా కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పారు. నేను వాడే సిమ్ కార్డును డూప్ సిమ్ తీసుకొని నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.
మా ఇంటి వద్దనున్న పెట్రోల్ బంక్ సమీపంలో, టెంపుల్ సమీపంలో వాహనాలను ఉంచి ఫోన్ ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావు కరీంనగర్‌లో మకాం వేసి మా ఫోన్లు ట్యాప్ చేశారు రాధాకిషన్‌రావు ప్రతిమ హోటల్‌లోని 314 రూంలో ఉంటూ (బిల్లులు చెల్లించకుండా) నా ఫోన్ ట్యాప్ చేశారు. నాతోపాటు పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడంతో వాళ్ల పైసలు పట్టుకున్నారు.
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు
ఇప్పటికీ ఫోన్‌ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాలున్నాయి. అందుకే ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా మాట్లాడుకునే దుస్థితి వచ్చింది. సీబీఐ విచారణకు అంగీకరిస్తే, నాదగ్గరున్న సమాచారమంతా అప్పగిస్తా. కరీంనగర్‌తో పాటు ఇతర లోక్‌సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఅర్ డబ్బులు పంపినట్టు అనుమానం కలుగుతోంది’అని సంజయ్ అన్నారు. అనంతరం పార్టీకార్యాలయంలో సినీనటి శైలజ, టీవీ యాక్టర్లు టి.జ్యోతి, డి.రమే‹Ùబాబు, మరికొందరు టీవీ సినీనటులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.