ఐపీఎల్-2024 ముగియగానే టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ మొదలుకానుంది. మే 26న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ షురూ కానుంది. ఇక టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఈవెంట్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఈ రన్‌మెషీన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో కలిపి 147.49 స్ట్రైక్‌రేటుతో 500 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే, టీ20లలో కోహ్లి స్ట్రైక్‌రేటు టీమిండియాకు ఇబ్బంది కానుందంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరం
ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి మేము చర్చించలేదు. ఐపీఎల్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరం.
మా జట్టు ప్రస్తుతం పూర్తి సమతూకంగా ఉంది. ఐపీఎల్ నుంచి సానుకూల అంశాలను మాత్రమే మనం స్వీకరించాలి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడేటపుడు ఒత్తిడిని జయించే అనుభజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
తద్వారా కోహ్లి కోసం యువ ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ వేశాడు అగార్కర్. రోహిత్ శర్మతో కలిసి గురువారం నాటి మీడియా సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగానే రోహిత్ శర్మ మాత్రం నవ్వేయడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
చదవండి: అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
Comments
Please login to add a commentAdd a comment