ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి(AP CEO) ఎంకే మీనా అన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,13,33,702 ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 2,02,74,144 మంది. మహిళా ఓటర్లు 2,10,56,137 మంది. అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశాం అని తెలిపారాయన.
ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటిదాకా 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. సీ విజిల్ యాప్‌కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందగా..156 మందికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ అంటే.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం. మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనం గా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం.
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే.. మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం.
జనసేన పోటీ చేస్తున్న లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల పరిధుల్లో ఎవరికీ గ్లాస్ గుర్తు కేటాయించలేదు. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం అని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment