Sakshi News home page

నెత్తురోడిన బస్తర్‌.. ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టుల మృతి

Published Wed, Apr 17 2024 4:23 AM

29 Maoists killed In Massive encounter in Chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 29 మంది మావోయిస్టుల మృతి

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం..  

బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్, ఎస్పీ కళ్యాణ్‌ ఎలిసెల్లి వెల్లడి  

బస్తర్‌ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్‌ బెటియా ప్రాంతంలో ఘటన 

మావోస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్‌ 

చేపట్టిన భద్రతా దళాలు..  మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఎదురుకాల్పులు 

మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్‌ శంకర్‌రావు.. ఈయన తలపై రూ. 25 లక్షల రివార్డు 

ఇద్దరు తెలంగాణ వాసులు కూడా గుర్తింపు 

రాష్ట్రానికి చెందిన మరికొందరు కూడా మరణించి ఉంటారనే అనుమానాలు.. ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు 

ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్‌ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్, ఎస్పీ కళ్యాణ్‌ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ, ఆర్‌కేబీ డివిజన్‌ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్‌ విజయ్, అలియాస్‌ శంకర్‌రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాంధర్‌ అలియాస్‌ మజ్జిదేవ్‌ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్‌ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. 
బస్తర్‌ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్‌ బెటియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బినాగుండ, కరోనార్‌ మధ్య హపటోలా, (ఛోట్‌ బెటియా పోలీస్‌ స్టేషన్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్‌ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్‌ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్‌ మిషన్‌ గన్స్, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు.  

మృతుల్లో మజ్జిదేవ్‌ భార్య లలిత! 
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్, ఆయన భార్య అదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూరుకు చెందిన ఆశశ్వర్‌ సుమన అలియాస్‌ రజిత మరణించినట్లు తెలుస్తోంది.

సిరిపల్లె సుధాకర్‌ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్‌ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాంధర్‌ అలియాస్‌ మజ్జిదేవ్‌ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్‌ రాజు సలామ్‌ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంగా చెబుతున్నారు.  

మజ్జిదేవ్‌ కూడా ఉన్నారా? 
ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్‌ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్‌ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్‌ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోందని తెలిపాయి. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి.  

నెలరోజుల్లో 79 మంది 
లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్‌ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్‌ జరగనుంది. 

తెలంగాణ పోలీసుల అలర్ట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది.  

Advertisement
Advertisement