సోషల్ మీడియాలో ఏబీ వెంకటేశ్వరరావు సందేశాలు పెట్టారు
ఆయన అలాంటి పోస్టు చేపడితే విచారణ సజావుగా సాగదు
ఆలిండియా సర్వీసెస్ నిబంధనల మేరకే ఆయనపై ప్రభుత్వ చర్యలు
క్రిమినల్ కేసులు తేలేవరకు సస్పెన్షన్ విధించే అధికారం సర్కారుకు ఉంది
క్యాట్‌లో ఏపీ ప్రభుత్వ ఏజీ శ్రీరాం వాదనలు
తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తన కేసుపై వచ్చిన ఓ పోస్టుకు.. ‘ఎవరినీ వదిలిపెట్టను’.. అంటూ సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టు పెట్టారని.. ఓ ఉన్నతస్థాయి అధికారి ఇలా మెసేజ్ పెడితే ఆయనపై కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)లో ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఆలిండియా సర్వీసెస్‌లోని నిబంధనల మేరకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిందన్నారు.
కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చినట్లు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీను సస్పెండ్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ‘సుప్రీం’ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్‌మీట్ల ద్వారా ట్యాపింగ్ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు ఏప్రిల్, 2023లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, నాన్–జ్యుడిషీయల్ సభ్యురాలు శాలినీ మిస్త్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు.
సాక్షులను బెదిరించే ప్రయత్నం..
‘రెండుసార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు వాడిన భాష సమర్థనీయం కాదు.. ఫోన్ ట్యాపింగ్, ఆవినీతి కేసుపై ‘ఆవుకథ, నాలుగు కాళ్ల జంతువు’ లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై, కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు, చానల్‌లో ప్రసారమైంది. కేసుకు ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా.. ఎవరినీ వదిలిపెట్టను అని వెంకటేశ్వరరావు థంబ్‌నెయిల్ పెట్టారు.
ఓ సీనియర్ ఐపీఎస్ ఇలా పెడితే సాక్షులు, విచారణాధికారులు ప్రభావితమవుతారు. ఆయనను విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవకాశంలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది’.. అని ఏజీ వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టులు..
‘నిజానికి.. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం.. క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసేవరకు వారిపై సస్పెన్షన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు, ఏపీ, బాంబే, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ హైకోర్టులు తీర్పులిచ్చాయి (వాటిని చదివి వినిపించారు). క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’.. ఏజీ వాదనలు వినిపించారు. అనంతరం వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్.. వెంకటేశ్వరరావు ప్రెస్‌మీట్ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, తీర్పు రిజర్వు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment