ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది
అన్ని అంశాలను క్యాట్ పరిగణనలోకి తీసుకోలేదు
అందువల్ల క్యాట్ తీర్పు అమలును నిలిపేయండి
హైకోర్టును అభ్యరి్థంచిన రాష్ట్ర ప్రభుత్వం
తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పు అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయన్నారు.
అక్రమాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు, కోర్టులో విచారణ ముగిసేంత వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందుకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అనుమతిని స్తున్నాయన్నారు. వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయన్నారు. అంతేగాక ఆయనపై నమోదైన కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేసేలా కూడా వ్యవహరించారన్నారు. రెండో సారి సస్పెండ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని, అయితే ఈ విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
అవినీతి నిరోధక చట్టం కింద ఏబీ వెంకటేశ్వరరావును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, క్యాట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చిందన్నారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సస్పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment