జిల్లా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలకు కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా బీఆర్‌ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని శుక్రవారంపిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.
జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్‌లో కేటీ రామారావు పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించనున్నారు.