పాతబస్తీలో పతంగేనా? | Hyderabad Lok Sabha battle is two sided | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పతంగేనా?

Published Wed, May 8 2024 5:52 AM | Last Updated on Wed, May 8 2024 5:52 AM

Hyderabad Lok Sabha battle is two sided

నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్‌ ఏకఛత్రాధిపత్యం 

ప్రత్యర్థులకు అందనంత దూరంలో మెజారిటీ 

మైనారిటీ ఓట్లు చీలకుండా పోటీ నుంచి తప్పుకున్న ఎంబీటీ 

ప్రచారంలో దూసుకెళుతున్న బీజేపీ  

హైదరాబాద్‌ లోక్‌సభ పోరు ద్విముఖం 

హైదరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో  అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను  నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్‌లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్‌ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. 

రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని  భూతద్దంలో చూపిస్తుండటంతో  హైదరాబాద్‌ లోక్‌సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..
దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్‌ ఇండియా–మజ్లిస్‌–ఏ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్‌ వన్‌సైడ్‌గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్‌ టూ డోర్‌ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్‌ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లతో  ప్రచారం నిర్వహిస్తున్నారు. 

హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్‌ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్‌ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్‌ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 

ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌  మజ్లిస్‌ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్‌ శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌లో తొలిసారిగా 1984లో మజ్లిస్‌ బోణీ కొట్టింది. అప్పటి నుంచి  సుల్తాన్‌సలావుద్దీన్  ఒవైసీ  వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 

అనుకూల అంశాలు 
» అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు 
» అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం 
» బలమైన ముస్లిం సామాజిక ఎజెండా 
» హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు 
» నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్‌ 
» లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం 
» ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం 

ప్రతికూల అంశాలు
» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు 
» పాతబస్తీ వెనుకబాటుతనం 
» తక్కువగా నమోదయ్యే పోలింగ్‌ శాతం 
 

మాధవీలత దూకుడు 
హైదరాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీ¯Œ  ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు.

 ఒక నేషనల్‌ టీవీ చానల్‌ నిర్వహించిన ‘ఆప్‌కి అదాలత్‌’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్‌ ఎంపీ టార్గెట్‌గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్‌ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్‌రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్‌ చందర్‌జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. 

అనుకూల అంశాలు 
»  బలమైన హిందుత్వ ఎజెండా 
»  ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం 
»  పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు 
»  ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు 
»  మజ్లిస్‌ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం 
»  ప్రధాని నరేంద్ర మోదీ  చరిష్మా 

ప్రతికూల అంశాలు
»  మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం 
»  ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్‌లోనే ప్రాతినిధ్యం 
»  స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం 
»  బలమైన పార్టీ కేడర్‌ లేకపోవడం 
»  స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ  

ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్,  బీఆర్‌ఎస్‌ 
అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్‌ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్‌తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్‌  వ్యూహాత్మకంగా హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మజ్లిస్‌తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని  గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీలో పెట్టింది. 

అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్‌ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్‌ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్‌ దక్కడం కష్టంగా తయారైంది.  బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా  పాతికేళ్లలో కనీసం డిపాజిట్‌ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ  వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement