ఫోన్‌ ట్యాపింగ్‌ డెన్‌గా ఆ గెస్ట్‌హౌజ్‌! | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ డెన్‌గా ఆ గెస్ట్‌హౌజ్‌!.. ఎమ్మెల్సీ వివరణ

Published Mon, Apr 8 2024 10:50 AM

Phone Tapping Case: Praneeth Rao Used This Guest House - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్‌ హౌజ్‌లో సోమవారం ఉదయం సోదాలు  జరిపారు. అయితే ఆ గెస్ట్‌హౌజ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ రావుకు చెందిందనే ప్రచారం జరిగింది. మరోవైపు.. ప్రతిపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి దీనినే ప్రణీత్‌ రావు బృందం డెన్‌గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. 

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో ఈ గెస్ట్‌ హౌజ్‌నే ప్రణీత్‌ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్‌ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే  సులువు అవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్‌ హౌజ్‌ నుంచే అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.  ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఫోన్ ట్యాపింగ్‌ ఆపరేషన్‌కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్‌ హౌజ్‌ మేలని ప్రణీత్‌ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్‌ హౌజ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ సంబంధిత ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్‌ రావును సైతం రేపో, మాపో దర్యాప్తు పిలిచి విచారణ జరపొచ్చని, నవీన్‌ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావొచ్చనే ప్రచారం నడిచింది.  ఎమ్మెల్సీ నవీన్‌ రావు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్‌ వెంట నడుస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే కేసీఆర్‌ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు.

అదంతా దుష్ప్రచారం: ఎమ్మెల్సీ నవీన్‌ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, తన గెస్ట్‌ హౌజ్‌ ప్రస్తావన రావడంతో ఎమ్మెల్సీ నవీన్‌ రావు స్పందించారు. ఆ ప్రచారమంతా అవాస్తవమని చెబుతున్నారాయన. ‘‘నాకు ఫోన్ ట్యాపింగ్ తో ఏలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో  నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నా గెస్ట్ హౌస్‌ను ఈ వ్యవహారంలోకి లాగారు. నా గెస్ట్‌ హౌజ్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్లపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement