మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్‌

Published Tue, Apr 30 2024 4:32 AM

CM YS Jagan Fires On Chandrababu At Election Campaign

చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ధ్వజం

జగన్‌ పథకాలే నువ్వూ చేస్తానంటున్నావంటే.. ఎవరు లీడర్‌? ఎవరు బచ్చా? 

జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటికీ మరింత మంచి 

బాబు వస్తే వర్షాలు గోవిందా! 

రిజర్వాయర్లలో నీళ్లూ గోవిందా!  

ఇంటింటి అభివృద్ధి కొనసాగింపే మన 2024 మేనిఫెస్టో 

జగన్‌ను ఎందుకు ఓడించాలని అడగండి 

చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని గట్టిగా నిలదీయండి.. ఎవరు హీరో... ఎవరు విలన్‌? ఆలోచించి ఓటేయండి

బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా...! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ గోవిందా...! ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా.. గోవిందా! తిరుమల వెంకన్న స్వామిని తలచుకుని చెప్పే గోవిందా గోవిందాలు కావు ఇవి. బాబును నమ్మితే అన్నీ గోవిందా..! 
– చోడవరం సభలో సీఎం జగన్‌

జగన్‌ను ఎందుకు ఓడించాలని అడగండి. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా? ఇంటింటికీ సంక్షేమాన్ని అందిస్తూ మంచి చేస్తున్నందుకా? చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు,జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం కోసం జగన్‌ను ఓడించాలా? వీరంతా కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా..? దోచుకున్నది పంచుకోవడం కోసమా? మరి జగన్‌ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబూ? 
– అంబాజీపేట సభలో సీఎం జగన్‌

మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను ‘‘బచ్చా..’’ అని అంటూనే భయపడుతున్నారు. చంద్రబాబూ నువ్వు నిజంగా అంత పుడింగే అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా? 14 ఏళ్లలో ఏ ఒక్క మంచీ చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్‌ ఐదేళ్లలో చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరు బచ్చా? ఎవరు లీడర్‌? చెప్పు చంద్రబాబూ..! 
– పొన్నూరు సభలో సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, గుంటూరు:  చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టిన­ట్లేనని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. 2014 ఎన్నికల హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని చంద్ర­బాబుకు అసలు ఓటు ఎందుకు వేయాలని ప్రజలంతా గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. 

చంద్రబాబుకు ఓటు వేస్తే జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్, గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

చరిత్ర చెబుతున్న సత్యం.. 
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ సజావుగా కొనసాగుతాయి. పొర­పాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 

లకలకా అంటూ మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ఇది చంద్రబాబు గురించి చరిత్ర చెబు­తున్న సత్యం. బాబును నమ్మడం అంటే విషసర్పాన్ని నమ్మడమేనని గుర్తుంచుకోండి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేసిందేమిటంటే.. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి ఇంత.. అంటూ అంతా కలసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే! 

బాబు డబ్బులిస్తే తీసుకోండి.. 
మీ బిడ్డ ఈరోజు బటన్‌ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లాయి. చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుని పంచుకున్నారు. చంద్రబాబు దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేలు.. రూ.3 వేలు.. రూ.4 వేలు.. రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. 

చంద్రబాబు డబ్బులిస్తే వద్దు అనొద్దండీ...! తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకుండా తీసుకోండి. కానీ ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది? ఎవరు అధికారంలో ఉంటే ఆ మంచి కొనసాగుతుంది? అనేది మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. 

మనం ఉంటేనే.... 
మీ జగన్‌ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, జగనన్న చేదోడు, లా నేస్తం లాంటివి సజావుగా కొనసాగుతాయి. పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష... ఇవన్నీ మీ జగన్‌ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది గుర్తుంచుకోండి. ఇంటికే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌర సేవలు, పథకాలన్నీ అందుతాయని గమనించాలని కోరుతున్నా. ఏ నెలలో ఏ పథకం అనేది ముందే క్యాలెండర్‌ ప్రకటించి మరీ మీ బిడ్డ లబ్ధి చేకూరుస్తున్నాడు.  

రెండు బటన్లూ ఫ్యాన్‌కే... 
వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా... అవి ఇంటికే రావాలన్నా... లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుండాలన్నా, మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించాలి. 

సామాజిక న్యాయంలో నువ్వెక్కడ?
ఈరోజు కేబినెట్‌లో 68 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కనిపిస్తున్నారు. 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అందిస్తే ఏకంగా 75 శాతం నేను ‘‘నా’’ అని పిలుచుకునే పేద వర్గాలకే దక్కింది. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏకంగా 80 శాతం పైచిలుకు ఆ సామాజిక వర్గాల పిల్లలకే దక్కాయి. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో ఆ వర్గాలకు ఏకంగా 50శాతం రిజర్వేషన్లతో చట్టం చేసి మరీ ఆత్మగౌరవం నిలబెట్టింది మీ జగన్‌ పాలనలోనే. 

175 అసెంబ్లీ, 25 ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే వంద సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతకు అర్థం చెప్పింది నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్‌ కాదా? సామాజిక న్యాయంలో నువ్వు చేసింది ఏందయ్యా చంద్రబాబూ? ఓ మోసాల బాబూ.. ఓ మోసాలయ్యా..! నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి 2014లో మీరిచ్చిన పాంప్లెట్‌ సరిపోదా? 

కోనసీమను కోరుతున్నా..
కోనసీమలో మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత ఎన్నికల్లో కులపరంగా లేదా పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే తరాల భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది. రాబోయే ఐదేళ్లలో మీ ఇంటికి పథకాలు, అభివృద్ధి అనేది నిర్ణయించేది మీ ఓటే. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలకు ఓటు హక్కు లేదని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 
 
చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ ఎలా ఉండేది?
చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? మీ బిడ్డ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా.  

ఎవరు హీరో? ఎవరు విలన్‌?  
ఈ యుద్ధంలో అటువైపు ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. చంద్రబాబుకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు! పేదవాడికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేసిన చరిత్ర లేని వీళ్లంతా కూటమిగా మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం,  బెంజ్‌ కారు అంటున్నారు. 

మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడిని. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ బిడ్డ వచ్చాడు. పేదలకు మరింత మంచి చేస్తూ ఇంటింటి అభివృద్ధి, పౌరసేవలు, ఇంటికే పథకాలు కొనసాగింపుగా వైఎస్సార్‌ సీపీ 2024 మేనిఫెస్టోను రూపొందించాం.  సినిమాకు వెళ్లినప్పుడు హీరో మంచి చేస్తాడు కాబట్టి అందరికీ నచ్చుతాడు. హీరోలో మానవత్వం ఉంది కాబట్టి నచ్చుతాడు. విలన్‌ ఎందుకు నచ్చడు? విలన్‌ మోసాలు, అబద్ధాలు, కుట్రలు చేస్తాడు కాబట్టి నచ్చడు. నిజ జీవితంలో కూడా ఆలోచన చేయండి ఎవరు హీరో? ఎవరు విలన్‌?

దీవించండి...
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణలను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన.  

ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావ్‌?
⇒ నువ్వు అంటున్నట్లుగా నేను బచ్చానే అయితే ఇంటింటికీ సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, 60–70 ఇళ్లకు వలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్, నాడు – నేడుతో బాగుపడిన ఇంగ్లీషు మీడియం బడులు, డిజిటల్‌ బోధన, ట్యాబ్‌లు, గ్రామంలోనే మహిళా పోలీసు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు.. ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబూ? 

⇒ చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్‌ 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీతో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాడు.  నేను బచ్చా అయితే.. మరి ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబూ? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు? 

⇒ నేను బచ్చాను అయితే ఒక అమ్మ ఒడి, చేయూ­త, ఆసరా, సున్నావడ్డీ, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహనమిత్ర, ఇంటికే రూ.3 వేల పెన్షన్, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా... ఇలాంటి పథకాలన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండీ ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబూ?

2014లో గోవిందా గోవిందా..!
⇒ 2014లో చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు నెలకు రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో నిరుద్యోగికి ఇవ్వాల్సిన  రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి గోవిందా! 
⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాల మాఫీ గోవిందా! 
⇒ రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ గోవిందా! 
⇒ అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద.  
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్‌ చేస్తామన్న  రూ.25 వేలు గోవిందా! 
⇒ ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు గోవిందా! 
⇒ ఓటుకు కోట్లు కేసులో చిక్కడంతో మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద!  
⇒ బాబును నమ్మి ఓటు వేసినందుకు ప్రత్యేక హోదా గోవిందా! 
⇒ ప్రత్యేక ప్యాకేజీ కూడా గోవిందా...గోవిందా! 
⇒ విభజన హామీలూ గోవిందా.  
⇒ సింగపూర్‌కు మించిన రాజధాని గోవిందా! 
⇒ గ్రాఫిక్స్‌ రాజధాని గోవిందా.. గోవిందా! 
⇒ ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ హామీ గోవిందా.. గోవిందా! 
⇒ బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా!  
⇒ బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా!  
⇒ సింగపూర్‌కు మించిన రాజధాని కడతానంటూ పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న మన విశాఖను విస్మరించారు. 
⇒ బాబు మాటలు నమ్మితే అంతా గోవిందా.. గోవింద!

జగన్‌ను ఓడించాలట.. ఇందుకా!
⇒ 77 ఏళ్ల స్వతంత్ర దేశ చర్రితలో ఏప్రభుత్వాలూ చేయనంత మంచిని మీ బిడ్డ ఐదేళ్లలో చేసినందుకు ఓడించాలా?  
⇒ 130 సార్లు బటన్లు నొక్కి లంచాలు లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో అందించినందుకా? 
⇒ ఈ పథకాలేవీ చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్‌ను ఓడించాలా?  
⇒ ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 32 వేల గవర్నమెంట్‌ ఉద్యోగాలిస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల  ఉద్యోగాలు ఇచ్చినందుకా?  
⇒ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు బిడ్డలను బడులకు పంపిస్తే చాలంటూ  అమ్మ ఒడి ఇచ్చినందుకా? 
⇒  ఏ ప్రభుత్వం చేయని విధంగా 66 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్లు ఇచ్చినందుకా? 
⇒ అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్‌ చిరునవ్వుతో ఇస్తున్నందుకా? 
⇒ మానవత్వం లేకుండా ఇంటివద్దే పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబుకు సంతోషం కలిగించేందుకా? 
⇒ ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నందుకా? 
⇒ చరిత్ర ఎరుగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకు వారి పేరిట రిజి్రస్టేషన్‌ చేసి మరీ ఇచ్చినందుకా? 
⇒ 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినందుకా? 
⇒ మరి జగన్‌ను ఎందుకు ఓడించాలి? బాబుకు 
ఎందుకు ఓటు వేయాలనేది మీరే చెప్పాలని 
అందరినీ అడుగుతున్నా.

పోయేకాలం వచ్చినప్పుడు..
విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో అంతా చూస్తున్నారు. తన హయాంలో ఏం చేశాడో చెప్పుకుని ఓట్లు అడగాల్సింది పోయి మీటింగుల్లో జగన్‌ను తిడుతున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్‌కు వెనక్కు పోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబూ..! నువ్వు బచ్చా అంటున్న నేను ప్రతి ఇంటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ప్రజల్ని ఓటు అడుగుతున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానంటావ్‌. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకొస్తుందా?  

Advertisement
Advertisement