కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..! | Sakshi
Sakshi News home page

కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!

Published Thu, May 2 2024 11:01 AM

JanaSena TDP Leader Internal Fight In Visakhapatnam

‘మీరు ఆ్రఫ్టాల్‌ జెండా కూలీలు మాత్రమే. మా పక్కన నిలబడే అర్హత మీకెక్కడిది. కిందకు దిగండి.. మీరు మా భ‘జనసేన’లా ఉండాలే తప్ప.. పక్కన ఉండాలని అనుకోవద్దు..’ ఇదీ భీమిలిలో జెండా మోస్తున్న గాజుగ్లాసు కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు బ్యాచ్‌ చేతుల్లో అడగడుగునా ఎదురవుతున్న పరాభవం. 

సాక్షి, విశాఖపట్నం : పొత్తుల్లో భాగంగా భీమిలి సీటును టీడీపీ చేతుల్లో పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు.. అసలు జనసేన తమ కూటమి కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలను పక్కన పెట్టేశారు. పొత్తు ఉందని ప్రచారానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలకు.. గంటా బ్యాచ్‌ చేతుల్లో ప్రతి రోజూ ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. గాజు గ్లాసుతో జెండా కనిపిస్తే చాలు.. గంటా బ్యాచ్‌ వారిపై విరుచుకుపడుతోంది. 

వారి తప్పు లేకపోయినా.. వారితో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి సమాధానం ఇస్తే చాలు టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల క్రితం మధురవాడలో టీడీపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జనసేన శ్రేణులకు దెబ్బలే మిగిలాయి. జీవీఎంసీ 6వ వార్డులో గంటా, భరత్‌ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. బైక్‌ ర్యాలీగా వచ్చిన వారిలో టీడీపీ, జనసేన కార్యకర్తల బైక్‌లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. 

ఇదే అదనుగా భావించిన గంటా బ్యాచ్‌.. అక్కడ గాజు గ్లాస్‌ జెండా పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరిపైనా చేయిచేసుకున్నారు. దొరికిన జనసేన కార్యకర్తను దొరికినట్లే చితక్కొట్టారు. చివరికి తమని జనసేన కార్యకర్తలు గాయపరిచారంటూ టీడీపీ శ్రేణులు పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గ్లాస్‌ బ్యాచ్‌ అవాక్కైంది. ప్రచారానికని పిలిచి.. కొట్టారంటూ పంచకర్ల సందీప్‌ వద్ద వాపోయినా.. తనకేం సంబంధం లేదన్నట్లుగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.  

రథం ఎక్కే అర్హత మీకెక్కడిదిరా..? 
తాజాగా మరో చేదు అనుభవం గ్లాసు కార్యకర్తలకు ఎదురైంది. భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో గంటా శ్రీనివాసరావు ప్రచారం సందర్భంగా యాతపేటలో మంగళవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. అప్పటికే ప్రచార రథంపై జనసేన మండల ఉపాధ్యక్షుడు ఎరుసు సూర్రెడ్డి తన అనుచరులతో కలిసి ఉన్నాడు. ఇది చూసిన టీడీపీ నేతలు డీఎఎన్‌ రాజు, కోరాడ రమణ తదితరులు సూర్రెడ్డితో పాటు మిగిలిన జనసేన శ్రేణుల్ని కిందకి దిగండి అని హుకుం జారీ చేశారు. మేం ప్రచారం చేస్తామని జెండాలు పైకెత్తడంతో.. అసహనానికి గురైన గంటా వర్గం.. గ్లాసు సేనని ప్రచార రథం నుంచి కిందకు లాగేశారు. అసలు మిమ్మల్ని ఎవడ్రా బండి ఎక్కించింది. ఎక్కించిన వాడికీ బుద్ధిలేదు.. ఎక్కిన మీకు బుద్ధి లేదు.. మీకంత అర్హతెక్కడిదిరా.. పొండిరా ఇక్కడి నుంచి.. కిందకెళ్లి.. మీ జెండాలు ఊపేసుకోండి.. అంటూ దూషించడంతో.. అందరి ముందు తీవ్ర అవమాన భారంతో వెనుదిరిగారు. 

ఈ వ్యవహారాన్ని సందీప్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గంటాకు సందీప్‌ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు తమకు జరిగిన అవమానం గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సందీప్‌ కూడా గంటా అనచరుడిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా అవమానాలు భరించాలా..? 
పవన్‌ కల్యాణేమో పొత్తులో ఉన్నామంటారు.. వీళ్లేమో జెండా కూలీలని అవమానిస్తున్నారు.. ఒక పార్టీలో ఉండి కూడా ఎందుకీ బతుకులు అన్నట్లుగా గాజుగ్లాసు సేన కుమిలిపోతోంది. అడుగడుగునా అవమానాలు పడుతూ, వాళ్ల చేతిలో దెబ్బలు తింటూ.. తిట్లు తిడుతుంటే పడుతూ.. టీడీపీ జెండాలు మోయడం తమకు అవసరమా అంటూ శ్రేణులు.. తమ అధినాయకత్వాన్ని ప్రశి్నస్తున్నారు. ఇప్పుడే ఇలా అవమానిస్తూ.. తన్ని తరిమేస్తుంటే.. రేపు పొరపాటున గంటా గెలిస్తే.. తమ ఆస్తులన్నీ లాక్కొని.. ఊరి నుంచి తరిమేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వాపోతున్నారు. 

ఇరువర్గాల మధ్య కొట్లాట  
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలసలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో అక్కరమాని ఎర్రయ్య, కొంగరాని సూరిబాబు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం గంటా ప్రచార ర్యాలీలో జనసేన నాయకులను టీడీపీ నాయకులు ప్రచార రథం నుంచి కిందకు లాగివేసిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిని వైఎస్సార్‌సీపీ నాయకులే వైరల్‌ చేశారని ఆరోపిస్తూ ఎక్కువ సంఖ్యలో టీడీపీ నాయకులు అక్కరమాని ఎర్రయ్య కుమారుడు రమణ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఎర్రయ్య తీవ్రంగా గాయపడటంతో 108లో కేజీహెచ్‌కు తరలించారు. ఈ దాడులలో మరో వర్గానికి చెందిన కొంగరాని సూరిబాబు గాయపడ్డాడు

Advertisement
Advertisement