అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ | Sakshi
Sakshi News home page

అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌

Published Thu, May 2 2024 9:24 AM

Gloucestershire Ben Wells Forced To Retire Due To Rare Heart Condition

అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్‌ కౌంటీ (గ్లోసెస్టర్‌షైర్‌) క్రికెటర్‌ బెన్‌ వెల్స్‌ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

వెల్స్‌ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్‌ స్క్రీనింగ్‌ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.

శారీరక శ్రమ లేకుండా క్రికెట్‌ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్‌ అర్దంతరంగా ముగియడంతో వెల్స్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్‌ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్‌ కౌంటీ జట్టు గ్లోసెస్టర్‌షైర్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.  

వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన వెల్స్‌.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్‌లో ఓ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌, 15 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్‌ ఇటీవలే లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్‌ వన్డే కప్‌లో భాగంగా డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్స్‌ ఈ సెంచరీ చేశాడు. వెల్స్‌కు లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్‌ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్‌ టేలర్‌ కూడా వెల్స్‌ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్‌కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. 

Advertisement
Advertisement