4,63,983 మంది ఓటుకు దూరం | Sakshi
Sakshi News home page

4,63,983 మంది ఓటుకు దూరం

Published Fri, May 17 2024 6:45 AM

4,63,983 మంది ఓటుకు దూరం

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఓటు బ్రహ్మాస్త్రంతో దేశ భవితను మార్చే అవకాశముంది. ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మన ప్రాంతమే కాకుండా దేశ దశ దిశను మార్చే శక్తి ఓటుకే ఉంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారి చాలా మందే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాయి. పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ నెల 13న నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,82,470 మంది ఓటర్లు ఉండగా, అందులో 12,18,487 మంది తమ ఓటుహక్కును వినియోగించున్నారు. మిగతా 4,63,983 మంది ఓటు వేయలేదు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో 72.42 శాతం పోలింగ్‌ కావడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 13, 68,868 మంది ఓటర్లు ఉండగా అప్పట్లో 9,26,516 (67.68శాతం) ఓట్లు పోల య్యాయి. అప్పటికి ఇప్పటికీ చూస్తే 3,13,602 మంది ఓటర్లు పెరిగినప్పటికీ పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం, ఓటుకు దూరంగా ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గుర్తింపు కార్డు కోసమే..

ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎంతో శ్రద్ద చూపెట్టారు. 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు నమోదు చేయిస్తారు. ఎన్నికల గుర్తింపు కార్డు రాకుంటే అధికారులతో మాట్లాడి తీసుకుంటారు. ఓట్ల పండగ వచ్చే సరికే దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర ప్రాంతాల్లో ఉంటే పిలవడం లేదు. దూరభారం అవుతుందని ఎందుకు ఇంతదూరమని చెప్పడంతో వారు కూడా వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. ఓటరు కార్డును ఒక గుర్తింపు కార్డు కోసమే వాడుతున్నారు.

● పట్టణాల్లో ఓటు వేసేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. ప్రతి ఎన్నికల్లో ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జడ్చర్ల, నారాయణపేట, షాద్‌నగర్‌ పట్టణ ప్రాంతాల్లో కొత్త ఓటర్లు వేలల్లో పెరుగుతున్నారు. ఓటింగ్‌ శాతం చూస్తే తక్కువగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement