కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Meeting With YSRCP MLCs Amid Council Session | Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేన హనీమూన్‌ నడుస్తోంది.. కొంత టైమిచ్చి పోరాడుదాం: ఎమ్మెల్సీల భేటీలో జగన్‌ వ్యాఖ్య

Published Thu, Jun 13 2024 10:18 AM | Last Updated on Thu, Jun 13 2024 3:37 PM

YS Jagan Meeting With YSRCP MLCs Amid Council Session

గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. 

వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.

2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా  ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.

అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. 
కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.

మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు.  అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.

ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.

మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.
ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను.  కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.

అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.

హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. 
ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.

జగన్‌ రాష్ట్ర పర్యటన
త్వరలో వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement