టెన్త్‌లో మళ్లీ నిర్మల్‌ టాప్‌.. అమ్మాయిలదే హవా | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో మళ్లీ నిర్మల్‌ టాప్‌.. అమ్మాయిలదే హవా

Published Wed, May 1 2024 5:47 AM

ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు బుర్రా వెంకటేశం, దేవసేన

99.05% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే నిర్మల్‌ జిల్లా ఫస్ట్‌

65.10% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో వికారాబాద్‌ జిల్లా

ఇంటర్‌లో మాదిరిగా టెన్త్‌లోనూ అమ్మాయిలదే హవా 

మొత్తంగా 91.31 శాతం ఉత్తీర్ణత 

3,927 స్కూళ్లలో 100% రిజల్ట్‌ 

ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌లో మాదిరిగానే టెన్త్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్‌ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్‌మెంటల్‌) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్‌ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్‌ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్‌ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. 

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్‌గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. 

ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత 
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్‌ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి.  

15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌ 
మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్‌ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్‌ టిక్కెట్‌ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్‌ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు.  

జూన్‌ 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
ఫెయిల్‌ అయిన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్‌ హెచ్‌ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి.  

ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం 
ఫెయిల్‌ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్‌ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్‌లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్‌ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.  



‘పది’లో సత్తా చాటిన గురుకులాలు 
రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత 
అత్యధికంగా జనరల్‌ సొసైటీలో 98.70శాతం పాస్‌ 

పెరుగుతున్న టెన్త్‌ ఉత్తీర్ణత 
– 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత 
– 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు 
– ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌ 
  

Advertisement
Advertisement