వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ.. కోటా యథాతథం | Sakshi
Sakshi News home page

వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ.. కోటా యథాతథం

Published Sat, Feb 10 2018 3:00 AM

for medical education degree seats quota is the same - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ అంశం కొలిక్కి వచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీలో నేషనల్‌ పూల్‌లో చేరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి కోటా ఉంటుందా లేదా అనే సందేహాలకు తెరపడింది. నేషనల్‌ పూల్‌లో చేరినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి కోటా కొనసాగనుంది. పూర్తి పరిశీలన అనంతరం తెలంగాణ న్యాయ శాఖ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మన రాష్ట్రం నేషనల్‌ పూల్‌లో చేరినా ఉమ్మడి రాష్ట్రాల కోటా కొనసాగాలని స్పష్టం చేసింది.

వైద్య విద్య సీట్ల భర్తీ అంశంలో నేషనల్‌ పూల్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) ఆమోదం తెలిపాయి. 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ పూల్‌ విధానం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. కాళోజీ నారాయణరావు వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి నేషనల్‌ పూల్‌ అమలు విషయాన్ని ‘సాక్షి ప్రతినిధి’తో ధ్రువీకరించారు. వచ్చే విద్యా సంవత్సరంలోనేషనల్‌ పూల్‌తోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటా సైతం ఉంటుందని పేర్కొన్నారు.

నేషనల్‌ పూల్‌ పరిధిలో ప్రస్తుతం 4,157 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న జమ్మూకశ్మీర్‌ వైద్య సీట్లను సొంతంగానే భర్తీ చేసుకుంటోంది. ఈ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ వంటి వైద్య విద్య డిగ్రీ సీట్లను నీట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటి వరకు నేషనల్‌ పూల్‌లో చేరలేదు. తాజాగా రెండు రాష్ట్రాలు నేషనల్‌ పూల్‌లో చేరాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలవుతుంది.

తెలంగాణలో 3,200 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. నేషనల్‌ పూల్‌ అమలు చేస్తుండటంతో 2018–19 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో 70 శాతం స్థానికులకే కేటాయిస్తారు. 15 శాతం సీట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటాగా ఉంటాయి. మరో 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌ కోటాలో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సమయంలో విద్యా సంస్థలకు పదేళ్లపాటు(2024 వరకు) ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిబంధన అమలులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల్లోని సీట్లలో 15 శాతం కోటాను మెరిట్‌ ప్రాతిపదికన పదేళ్లపాటు పరస్పరం కేటాయించుకోవాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. 15 శాతం సీట్లలో మెరిట్‌ కోటా కింద ఆంధ్రప్రదేశ్‌ వారు పోటీ పడతారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధానం అమలవుతోంది. ఆ రాష్ట్రంలోని 15 శాతం సీట్లకు తెలంగాణ విద్యార్థులు మెరిట్‌ ప్రాదిపదికన దక్కించుకునే అవకాశం ఉంటుంది.

అలాగే మరో 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌లోకి వెళ్తాయి. అన్ని రాష్ట్రాల్లోని అభ్యర్థులు మెరిట్‌ ప్రాతిపదికన నేషనల్‌ పూల్‌లోని సీట్లను పొందే పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్రంలోని విద్యార్థులు సైతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లను మెరిట్‌ ప్రాదిపదికన పొందే అవకాశం ఉంటుంది.

వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ కోసం మే 6న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)ను నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9 వరకు దరఖాస్తు ప్రక్రియగా నిర్ణయించారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ, ఫీజు చెల్లింపు అన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఉండనున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లో నీట్‌ను నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement