క్రికెట్‌కు వెన్నుదన్నుగా.. | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు వెన్నుదన్నుగా..

Published Tue, Apr 23 2024 8:40 AM

మంచిర్యాల జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో బ్యాటింగ్‌లో శిక్షణ పొందుతున్న ఔత్సాహికులు
 - Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): పట్టణ, గ్రామీణ ఔత్సాహిక క్రికెట్‌ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ వేసవిలో ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు ప్రాంతాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. 2016 తర్వాత అంటే దాదాపు 8 ఏళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది.

పూర్తిస్థాయి సౌకర్యాల మధ్య..

క్రీడాకారుల కోసం మ్యాట్‌లు, నెట్‌తోపాటు జంబో కిట్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్రాల్లో నిష్ణాతులైన, సుశిక్షితులైన కోచ్‌లతో శిక్షణ అందించనున్నారు. కోచ్‌తోపాటు సహాయ శిక్షకులను నియమించి మెరుగైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ప్రతీరోజు అల్పాహారం కింద అరటిపండు అందించడంతోపాటు మంచినీటి వసతి కలిపించనున్నారు.

ఉమ్మడి జిల్లాలోని శిక్షణ కేంద్రాలు..

ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాల మైదానం, ఆదిలాబాద్‌లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, కాగజ్‌నగర్‌లో సర్‌సిల్క్‌ మైదానంలో క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శిబిరాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే క్రికెట్‌ శిక్షణకు తాకిడి ప్రారంభం కాగా 25 నుంచి అధికారికంగా శిబిరాలు ప్రారంభించనున్నారు. నెల రోజులపాటు అంటే మే 25వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు మంచిర్యాల జిల్లా క్రికెట్‌ కోచ్‌ ప్రదీప్‌(9440010696), ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి అతాఉల్లాహ్‌(9440207473), కాగజ్‌నగర్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌(9492333333)ని సంప్రదించి శిక్షణకు పేర్లు నమోదు చేసుకోచాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి..

క్రికెట్‌పై అసక్తిగల క్రీడాకారులకు ఈ వేసవిలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ కోసం ఇప్పటికే 100 మందికిపైగా పేర్లు నమోదు కాగా వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్‌ శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణస్థాయి పెంచి మరికొంత మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారా శిక్షణ పొందిన క్రికెట్‌ క్రీడాకారులు యూనివర్సిటీ, జిల్లా, అంతర్‌ జిల్లా స్థాయిలో ఆడారు. అండర్‌–23 ప్రాబబుల్‌ జట్టులో చోటు సంపాధించిన వారు ఉండగా ఇంకా రంజీల్లో ఆడిన వారు కూడా ఉన్నారు. ప్రత్యేక శిక్షణ అందిస్తున్న ఈ వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలను ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి.

– ప్రదీప్‌, జిల్లా కోచ్‌,

క్రికెట్‌ అసోసియేషన్‌

టీడీఎల్‌ టీ–20 లీగ్‌లో అవకాశం..

వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ డిస్ట్రిక్ట్‌ లీగ్‌(టీడీఎల్‌) టీ–20 పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ శిక్షణ జరగనున్న నేపథ్యంలో అందరితో కలిపి క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించి ఉమ్మడి జిల్లా సీనియర్‌ జట్టుకు ఎంపిక చేస్తారు. శిబిరాల్లో రాణించే క్రీడాకారులకు ఎండీసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాదిలో హెచ్‌సీఏ నిర్వహించనున్న అండర్‌–14, 16, 18, 20 విభాగాలతోపాటు ఇతర టోర్నీలకు ఎంపిక చేయనున్నారు. నైపుణ్యం కనబరిచే క్రీడాకారులకు హెచ్‌సీఏ టాలెంట్‌ హబ్‌ అకాడమీల్లో ప్రవేశాలు లభించే అకవాశం ఉంది.

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో డీసీఏ ఉచిత శిక్షణ

శిబిరానికి వెల్లువెత్తుతున్న ఔత్సాహికులు

ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యేక శిబిరాలు

ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ఏర్పాటు

మంచిర్యాల జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో బౌలింగ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు
1/2

మంచిర్యాల జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో బౌలింగ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు

2/2

Advertisement
Advertisement