Sakshi News home page

Ayyanna Patrudu: అధికారం కోసం ఆబగా...!

Published Wed, Apr 17 2024 5:50 AM

- - Sakshi

 పదవులకోసం అయ్యన్న కుటుంబం ఎదురుచూపులు

 మండలానికి ఒకరు చొప్పున అధికారం పంపిణీ

ఇప్పటికే మున్సిపాలిటీలో భార్య పెత్తనం

పాత రోజులు మాకొద్దు బాబోయ్‌ అంటున్న ప్రజలు

సాక్షి, అనకాపల్లి: ఎంపీ సీటు ఆశించిన ఒక కుమారుడు... ఎమ్మెల్యే సీటు ఆశించిన మరో కుమారుడు... మున్సిపాలిటీలో ఇప్పటికే కౌన్సిలర్‌గా ఉన్న సతీమణి... ఎమ్మెల్యే బరిలో ఉన్న అయ్యన్న ఇలా నలుగురూ అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నలుగురూ చెరోవైపు ప్రచారం నిర్వహిస్తుండగా... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెత్తనాన్ని కూడా నలుగురూ పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి ఒక సీటే అని చంద్రబాబు తమకు ఇప్పటికే దెబ్బ వేశారనే కసితో ఉన్న సదరు కుటుంబం... నర్సీపట్నం నియోజకవర్గాన్ని నాలుగువైపులా పంచుకుని అధికారం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అయ్యన్న వ్యవహారం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న, ఆయన కుమారుడు చక్రం తిప్పి నర్సీపట్నంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు లేటరైట్‌ను అక్రమంగా తవ్వి అక్రమ సంపాదన ఆర్జించారు. అంతేకాకుండా మూడు ఆక్రమణలు... నాలుగు రంగురాళ్లు అన్న చందంగా రంగురాళ్ల వెలికితీత కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కొడుకు విజయ్‌, భార్య పద్మావతి జోక్యం విపరీతంగా ఉండేదన్న విమర్శలున్నాయి. వీరికితోడు ఇప్పు డు సకుటుంబ సపరివార సమేతం అనే రీతిలో అధికారం చెలాయించేందుకు ఆబగా ఎదురుచూస్తు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయ్యన్నకు ఓటు వేస్తే నలుగురు ఎమ్మె ల్యేలు.... తనకు ఓటు వేస్తే ఒక్కరే ఎమ్మెల్యే అని... తన కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ ఆకాంక్షలు లేవని ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీట్లను ఆశించి....!
వాస్తవానికి ఎంపీగా తన కొడుకుకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు సాక్షిగా అయ్యన్న కోరారు. తనకు ఎమ్మెల్యేగా, కొడుకుకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని... స్థానిక అభ్యర్థులను కాదని బయటివారికి ఎలా ఇస్తారంటూ పార్టీ సమావేశాల్లో ప్రశ్నించారు. తీరా బీజేపీ కోటాలో బాబు శిష్యుడు సీఎం రమేష్‌ అనకాపల్లి సీటును కొట్టేశారు. నాన్‌ లోకల్‌ అయినప్పటికీ సీఎం రమేష్‌ను మాత్రం అయ్యన్న ఒక్క మాట కూడా అనలేదు. మరోవైపు అన్న కోసం ఎంపీ సీటు కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు తనకు ఇవ్వాలని కోరాలంటూ చిన్న కుమారుడు పోరు పెట్టారు. రాజకీయ వారసత్వం కోసం కొడుక్కి సీటు ఇప్పించాల్సిందేనని ఇంటిపోరు కూడా అయ్యన్నకు ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్క ఎమ్మెల్యే సీటును నలుగురూ పంచుకుని అధికారం చెలాయిద్దామనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఏ ఒక్క పదవినీ వదలరు
మొదట్లో అయ్యన్నపాత్రుడు, సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సమన్వయంతో రాజకీయాలు నడిపేవారు. ఈ సమయంలో పెద్ద కొడుకు విజయ్‌ జోక్యం పెరిగింది. సన్యాసిపాత్రుడు కదిలికలను తెలుసుకునేందుకు కారులో వాయిస్‌ రికార్డర్‌ అమర్చారు. ఈ వ్యవహారం కుటుంబ కలహాలకు దారి తీసింది. ఈ సంఘటనతో అయ్యన్నపాత్రుడి వద్ద ఇమడలేక సన్యాసిపాత్రుడు, మిగిలిన సోదరుల కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు.

ఏ ఒక్క పదవీని అయ్యన్నపాత్రుడు కుటుంబం వదలేదు. పురపాలిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కౌన్సిలర్‌గా ఎన్నికై 26వ వార్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిన్న కుమారుడు రాజేష్‌ 25వ వార్డుకు కౌన్సిలర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆఖరి మొత్తం పదవులన్నీ వారి కుటుంబంలో ఉంచుకున్నారు. ఎమ్మెల్యేగా గణేష్‌ గెలిస్తే ప్రజలు నేరుగా వెళ్లి పనులు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుందనీ, టీడీపీ గెలిస్తే ముగ్గురిని దాటుకుని అయ్యన్నపాత్రుడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే గణేష్‌ ఐదేళ్ల కాలంలో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని, ప్రశాంతంగా ఉందని, కొరివితో తల గోక్కున్నట్టు అయ్యన్నను మళ్లీ తెచ్చుకుంటామా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Advertisement