గన్నవరంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కొరవడిన సఖ్యత
ఎస్సీ, బీసీ వర్గాలపై చిన్నచూపు
ప్రచారంలో కానరాని స్పందన
ఓటర్లను ప్రలోభ పెట్టడంపైనే గురి
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు.
పెరిగిన అంతరం
ఇటీవల హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు.
ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
బీజేపీ సహకారం అంతంతమాత్రం
నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు.
పార్టీలో చేరికలు అంటూ కలరింగ్
టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
వంశీ ప్రచార జోష్
ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది.
నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment