ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తనపై ఫేక్ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.
మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.
మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం.
ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్ భయపడుతోంది అని షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment