
జగ్గయ్యపేట: ఎన్నికలు వచ్చాయంటే ఎన్నో కొత్త విషయాలు బయటికొస్తాయి. ఒకనాడు సంస్థానాలు పాలించిన వారు.. నేడు ఎన్నికల బరిలో దిగుతున్నారు.
ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి 70వ దశకంలోనే చరిత్ర సృష్టించారు. 1972లో ముక్త్యాల గ్రామానికి చెందిన వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్(ముక్త్యాల రాజా) అప్పటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపాల బుచ్చరామయ్య శ్రేష్ఠిపై పోటీ చేసి గెలుపొందారు. 1974లో ఆయన మరణానంతరం భార్య వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ (ముక్త్యాల రాణి) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పట్లోనే నియోజకవర్గ చరిత్రలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత జగ్గయ్యపేటకు దక్కింది.