Cabinet approves Rs 89,000 crore revival plan for BSNL - Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ

Published Thu, Jun 8 2023 3:01 AM

Cabinet approves Rs 89000-crore revival plan for BSNL - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది.

రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్‌ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్‌ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది.

దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్‌ కేటాయింపులతో బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది.

Advertisement
Advertisement