Sakshi News home page

బిలియనీర్స్‌ జాబితాలో స్థానం.. కోర్టులో ఊరట

Published Tue, Mar 26 2024 2:28 PM

Donald Trump Is One Of World 500 Richest People - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయనకు చెందిన ఒక కంపెనీ డీల్‌ ఇటీవల పూర్తయింది. దాంతో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. 

ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా తాజా అంచనాల ప్రకారం ట్రంప్‌ సంపద విలువ 4 బిలియన్‌ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.54 వేల కోట్లు) చేరింది. గతంలో ఎప్పుడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయికి చేరలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ సంస్థ డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ (డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇది దాదాపు 29 నెలలుగా సాగుతూ వస్తోంది. మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. దాంతో ట్రంప్‌ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాస్‌డాక్‌లో డీజేటీ పేరిట ట్రేడింగ్‌ కానుంది.

ఇదీ చదవండి: రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ

ఆస్తులు పెరగడంతోపాటు ట్రంప్‌నకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. తన సంపదకు సంబంధించి గతంలో తప్పుడు లెక్కలు చెప్పినట్లు అభియోగాలు వచ్చాయి. దాంతో విచారణ జరిపిన అమెరికా కోర్టు ఆయనకు రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) జరిమానా విధించింది. ట్రంప్‌ తనపై వచ్చిన అభియోగాలను, దిగువ కోర్టు విధించిన జరిమానాను సవాలు చేస్తూ పై కోర్టును ఆశ్రయించారు. ఇటీవల దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి అప్పీల్స్‌ న్యాయస్థానం ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేస్తే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలిపేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. దాంతో ట్రంప్‌నకు భారీ ఊరట లభించినట్లైంది.

Advertisement
Advertisement