Sakshi News home page

ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌కు ఇదే చివరి తేది!

Published Sun, Nov 26 2023 8:10 PM

Last Date For Free Adhaar Update - Sakshi

ఆధార్‌ తీసుకుని పదేళ్లు దాటితే అప్‌డేట్‌ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వారు 2023 డిసెంబర్‌ 14లోపు అప్‌డేట్‌ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు  ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్‌)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!

ఆధార్‌ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను నమోదు చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్‌ తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది.

Advertisement
Advertisement