Sakshi News home page

ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మోసాలు

Published Mon, Jul 3 2023 2:56 AM

Free laptops scams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్‌ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్‌ఎల్‌ లింక్‌లను జత చేస్తున్నారు.

ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్‌లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్‌లోకి మాల్‌వేర్‌ను మనకు తెలియకుండానే ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు.

ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్‌టాప్‌ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు.  

స్టే సేఫ్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌
ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన..
పోటీల గడువు ఈనెల 31

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్‌ ఆన్‌లైన్‌..’ నేపథ్యంతో ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్‌ పై క్లిక్‌ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

టెలిగ్రామ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, https://t.me/ ssoindia  లింక్‌ ద్వారా గ్రూప్‌లో చేరొచ్చు. ఈ ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్‌లో టాప్‌ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్‌లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.  

Advertisement
Advertisement