ఆర్థిక ఫలితాలు మే 30కి వాయిదా
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment