vehicle loans
-
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది. -
టయోటా వాహనాలకు యూనియన్ బ్యాంక్ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టయోటా వాహనాల కొనుగోలుకై కస్టమర్లకు సమగ్ర రుణ సౌకర్యాన్ని బ్యాంకు కల్పించనుంది.ఆన్‌రోడ్ ధరపై 90 శాతం వరకు లోన్ సమకూరుస్తారు. యూనియన్ వెహికిల్ స్కీమ్ కింద 84 నెలల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంది. యూనియన్ పరివాహన్ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య వాహనాలకు 60 నెలల వరకు వాయిదాలు ఆఫర్ చేస్తారు. అన్ని రకాల టయోటా వాహనాలకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్‌ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్‌టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
వెహికల్ లోన్ కోసం చూస్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి. వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
ఎస్బీఐ ఆఫర్.. యోనో యాప్ ద్వారా రూ.3 లక్షల దాకా రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యోనో యాప్ ద్వారా ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.3 లక్షల వరకు ముందుగా అనుమతించబడిన (ప్రీ–అప్రూవ్డ్) రుణం ఇవ్వనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. అర్హతగల వినియోగదార్లు బ్యాంక్ శాఖను సంప్రదించకుండానే యాప్ ద్వారా రుణం పొందవచ్చు. కనీస రుణ మొత్తం రూ.20,000. కాల పరిమితి గరిష్టంగా నాలుగేళ్లు. వడ్డీ సాలీనా 10.5 శాతం నుంచి ప్రారంభం. వాహనం ఆన్‌రోడ్ ధరపై 85 శాతం దాకా రుణం తీసుకోవచ్చు. రూ.1 లక్ష లోన్ తీసుకుంటే నెల వాయిదా సగటున రూ.2,560 చెల్లించాల్సి ఉంటుంది. -
లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు
మీ కలల గృహం లేదా కారు కోసం లోన్ తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. వివిధ అవసరాల కోసం లోన్ తీసుకునే వారి కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్, విదేశాలలో విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ వంటి మీకు అవసరమైన రుణం పొందొచ్చు. లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రుణం తీసుకోవాలని భావించే వారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకోవాలని వారికీ వడ్డీ రేటు 6.7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కొత్త కారు కోసం లోన్ పొందాలని చూస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్ కోసం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్ లోన్‌పై 9.3 శాతం వడ్డీ ఉంటే ఎస్బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపోతే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణంపై వడ్డీ రేటు మారొచ్చు. కొత్త ఇళ్ల కోసం రుణాలు తీసుకునే వారికీ ఇది వర్తిస్తుంది. చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్! -
అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర.. ♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు ♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు ♦ ఎంఎస్ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు ♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు ♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు ♦ ఎన్బీఎఫ్సీ రంగానికి రూ.19,627 కోట్లు -
ఎస్బీఐ పండుగ ధమాకా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా పండుగ సీజన్ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్ డిజిటల్ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వడ్డీ రేట్ల మార్పులకు సంబంధించి ఈ రుణాలపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని వివరించింది. యోనో వంటి సొంత డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి లేదా వెబ్సైట్ ద్వారా కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వడ్డీపై 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) మేర తగ్గింపు కూడా పొందవచ్చు. వేతన జీవులు కారు ఆన్ రోడ్ ధరలో 90 శాతం దాకా రుణంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయన్నది మాత్రం ఎస్బీఐ వెల్లడించలేదు. చౌకగా గృహ రుణాలు.. సెప్టెంబర్ 1 నుంచి ప్రస్తుత, కొత్త గృహ రుణాలన్నింటికి రెపో రేట్ ఆధారిత వడ్డీ రేట్లు వర్తింపచేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇటీవలే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా గృహ రుణాలపై వడ్డీ రేటు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. మరోవైపు రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేటు అత్యంత తక్కువగా 10.75% నుంచి ప్రారంభమవుతుందని ఎస్బీఐ తెలిపింది. సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్బీఐలో శాలరీ అకౌంటు ఉన్న ఖాతాదారులు యోనో యాప్ ద్వారా రూ. 5 లక్షల దాకా ప్రీ–అప్రూవ్డ్ రుణాలను పొందవచ్చని వివరించింది. అటు విద్యా రుణాలపై వడ్డీ రేటు 8.25% నుంచి ప్రారంభమవుతుందని ఎస్బీఐ తెలిపింది. దేశీయంగా విద్యకు రూ.50 లక్షల దాకా, విదేశీ చదువు కోసం రూ.1.50 కోట్ల దాకా రుణాలు పొందవచ్చు. సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు రుణాల చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని, తద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చని ఎస్బీఐ వివరించింది. రెపోతో బల్క్ డిపాజిట్ రేట్ల అనుసంధానం.. రిజర్వ్ బ్యాంక్ తగ్గించే పాలసీ రేట్ల ప్రయో జనాలను ఖాతాదారులకు బదలాయించాలంటే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించేలా బ్యాంకుల ను ఆర్బీఐ ఆదేశించాలని ఎస్బీఐ ఒక నివేదికలో పేర్కొంది. చిన్న డిపాజిట్‌దారులు, సీనియర్ సిటిజన్స్ ప్రయోజనాలను దెబ్బతీయకుండా, అటు నిధుల సమీకరణ వ్యయాలను బ్యాంకులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ‘ఎకోర్యాప్’ నివేదికలో వివరించింది. ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే స్వచ్ఛందంగా తమ వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించాయి. రూ. 2 కోట్ల పైబడిన డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో వీటి వాటా సుమారు 30 శాతంగా ఉంటుందని అంచనా. చాలామటుకు బల్క్ డిపాజిట్లు పెద్ద సంస్థల నుంచి ఉంటాయని, చిన్న డిపాజిటర్లతో పోలిస్తే ఇవి వడ్డీ రేట్ల పరంగా కాస్త రిస్కులు భరించగలిగే అవకాశం ఉంటుందని ఎస్బీఐ నివేదిక వివరించింది. రుణాలపైనా, డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను రెపోతో అనుసంధానించాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకులకు సూచించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఓబీసీ నుంచి రెపో ఆధారిత రుణాలు.. ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ) ఇకపై గృహ, వాహన రుణాలను రెపో ఆధారిత వడ్డీ రేట్లకు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.35% నుంచి, వాహన రుణాలపై రేటు 8.70% నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఎంసీఎల్ఆర్ లేదా రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లలో ఏదో ఒక దాన్ని కస్టమర్లు ఎంచుకోవచ్చని వివరించింది. -
ఖాతాల నుంచే కోత!
రుణాల రికవరీకి ఎత్తుగడ స్టేట్ బ్యాంకుల నిర్వాకం మునగపాక : మునగపాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి రుణాలు రికవరీ చేస్తున్నారు. ఖాతాదారుని అకౌంట్ నుంచి నగదు లావాదావీలకు ఖాతాదారుని అనుమతి తప్పనిసరి. బ్యాంక్ అధికారులు మాత్రం తమకు ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలువురు ఖాతాదారులు నివ్వెరపోతున్నారు. మునగపాకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చూచుకొండలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలున్నాయి. ఈ బ్యాంక్‌ల ద్వారా నగదు లావాదేవీలతో పాటు ఇళ్లు, వ్యవసాయ, వాహన రుణాలు పొందుతున్నారు. తమ ఖాతాల ద్వారా పొదుపులు కూడా చేస్తున్నారు. కొంతకాలంగా ఖాతాదారులకు తెలియకుండానే పొదుపు ఖాతాల్లో ఉన్న నగదును అధికారులు రుణాల రికవరీ చేసేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని ఆశిస్తున్న రైతులు బ్యాంక్ అధికారుల నిర్వాకానికి కంగుతింటున్నారు. నగదు లావాదేవీలకు తప్పనిసరిగా ఖాతాదారుని అనుమతి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకూ రుణ మాఫీ చేస్తుందన్న ఆశతో మహిళలు సభ్యులు పొదుపులు చేసుకుంటున్నారు. ఆ నగదును సైతం అప్పుల రికవరీకి మళ్లిస్తుండడంతో వీరూ ఆందోళన చెందుతున్నారు. మునగపాకకు చెందిన బొడ్డేడ మహేష్ ఈ ఏడాది జనవరి 7న రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఆ వ్యక్తికి బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉంది. ఆయనకు తెలియకుండానే ఈనెల 5న రుణం చెల్లించలేదని రూ.25 వేలను పొదుపు నుంచి మళ్లించడంతో షాక్‌తిన్నాడు. ఇలా పలువురి పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ము రుణాల కింద రికవరీ చేస్తున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు. దీనిపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా రుణాలు తీసుకున్న వారు సకాలంలో తీర్చకపోతే వారి పొదుపు ఖాతాల నుంచి రికవరీ చేసుకోవాలన్న ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు. -
నెమ్మదించనున్న ట్రాక్టర్ల అమ్మకాలు : మాగ్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని, అది ఈ ఏడాది 5 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్బీఎఫ్సీ మాగ్మా ఫిన్‌కార్ప్ పేర్కొంది. ఎలినెనో, వర్షాలు ఆలస్యంగా కురవడం కారణంగా ఖరీప్ పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల అమ్మక విభాగ అధిపతి ధృబషీష్ భట్టాచార్య తెలిపారు. గతేడాది రబీ పంటలు బాగుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసిక అమ్మకాలు బాగున్నాయని, కాని రెండో అర్థభాగం నుంచి అమ్మకాలు తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టాచార్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినా, మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల రుణాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో గతేడాది రూ.562 కోట్ల రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాపారంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూ. 500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు అనుమతించిందని, అవసరమైనప్పుడు ఈ నిధులను సమీకరిస్తామన్నారు. తెలంగాణాలో 12, ఆంధ్రాలో 12 శాఖలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లో శాఖల సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు.