టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెబుతారు. హామీలిచ్చి మోసం చేయడంలో ఆయన్ను మించినవారు లేరని దేశమంతా చెప్పుకుంటారు. వర్తమాన భారత రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసపూరిత నేత మరొకరు లేరని అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. 2014 ఎన్నికలపుడు 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ వెబ్‌సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే మాయం చేశారు. మళ్ళీ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మాయం చేసిన నాటి మేనిఫెస్టోకి కొత్తగా పచ్చ రంగులేసి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తడానికి నానాపాట్లు పడుతున్నారు. చంద్రబాబు అంటేనే దగా, మోసం, కుట్ర, వెన్నుపోట్లు అని అందిరికీ తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తారు, ఏ స్థాయికైనా దిగజారతారు.
అలవికాని హామీలిచ్చి ప్రజల్ని భ్రమల్లో ముంచుతారు. ఎలాగూ అమలు చేసేది లేదు కనుక ఎటువంటి హామీలైనా ఇచ్చేస్తారు. అలాగే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తొలి ఎన్నికల్లో 50 పేజీలతో కూడిన రంగు రంగుల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో 600కు పైగా హామీలిచ్చారు. ఒకవైపు బీజేపీని మరోవైపు పవన్‌కల్యాణ్‌ను పెట్టుకుని ప్రచారం చేసుకుని.. అతికష్టం మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే తన మేనిఫెస్టోను ప్రజలు గుర్తు చేసుకోకూడదని, చదివి ప్రశ్నించకూడదని టీడీపీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. ఇదీ చంద్రబాబు ఘనత.
చెప్పేవాడు చంద్రాబాబు అయితే..వినేవాళ్ళు వెర్రివాళ్ళని ఆయన అనుకుంటారు. అందుకే పదేళ్ళనాడు ఇచ్చిన హామీలు ఎవరికి గుర్తుంటాయిలే..అసలు మేనిఫెస్టోనే మాయం చేశాం కదా..అవి ఎవరికీ తెలియవులే అనుకుని..మరోసారి అంతకంటే ఎక్కువగా..అంతకుమించి అన్నట్లుగా హామీలు గుప్పిస్తున్నారు. ఆనాడు అమలు చేయని హామీల్ని ఈసారి అధికారంలోకి వస్తే గొప్పగా అమలు చేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అప్పటిమాదిరిగానే..ఈసారి కూడా ఒకవైపు కమలం పార్టీని మరోవైపు పవన్ పార్టీని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్నవాటికంటే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నట్లు ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు చంద్రబాబు. అసలు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి వివరంగా చూద్దాం.
50 పేజీల మేనిఫెస్టోలో 11వ పేజీ నుంచి 45వ పేజీ వరకు వందలకొద్దీ హామీలు కనిపిస్తాయి. సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా..ప్రతి ఒక్కరి మీదా హామీల సునామీతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా నానా కష్టాలు పడ్డారు గనుక అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ మీదే తొలి సంతకం చేస్తానని కూడా చెప్పారు. అయితే 87వేల కోట్లకు పైగా ఉన్న వ్యవసాయ రుణాల్ని పంచ పాండవులు మంచం కోళ్ళ సామెతలా 20 వేల కోట్లకు మాత్రమే రద్దు అర్హత ఉందని తేల్చారు. అదీ ఐదు సంవత్సరాల్లో రద్దు చేస్తామని ప్రకటించారు. నాలుగు విడతలు బ్యాంకులకు చెల్లించి ఐదో విడత చెల్లించకుండానే రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రుణాలు రద్దు కాకపోవడంతో వడ్డీలు మరింతగా పెరిగి లక్షలాది మంది భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. రుణమాఫీ అనేది మోసపూరిత హామీగా చంద్రబాబు రుజువు చేసుకున్నారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ గురించి అడిగిన స్వయం సహాయక బృందాల మహిళలను చంద్రబాబు బెదిరించారు. డ్వాక్రా సంఘాల రుణాలు ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్న మద్యం బెల్ట్ షాపుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ద్వారా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కాని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కటి కూడా రద్దు కాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలిప్పిస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు విజయవంతంగా మర్చిపోయారు.
రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఒక్కరికి కూడా 30 వేలు కాదు కదా..30 రూపాయలు కూడా ఇవ్వలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఫోన్ ఇవ్వలేదు. పేద కుటుంబాలకు సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. హైస్కూల్, ఇంటర్‌మీడియట్ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామన్నారు. తన పార్టీ గుర్తు విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క విద్యార్థినికి కూడా సైకిల్ ఇవ్వలేదు. కాలేజ్ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్స్ ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 8వ తరగతి నుంచే ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ పాఠాలు లోడ్ చేసిన ట్యాబ్స్ ఉచితంగా ఇస్తున్నారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఉద్యోగ మిత్ర పథకం కింద ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ యువతీ యువకులకు వెయ్యి నుంచి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని నాలుగున్నరేళ్ళు కళ్ళు మూసుకుని సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కొద్ది మంది టీడీపీ కార్యకర్తలైన యువతీ, యువకులకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. 60 నెలల పాటు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని కేవలం మూడు నెలల పాటు కొద్ది మందికి ఇచ్చి...ఇచ్చేశానంటూ డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు.
మైనారిటీల కోసం విశాఖ, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో మూడు హజ్ హౌజ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఒక్క చోట కూడా వాటి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక కమిషన్ నియమించి బీసీ వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి రిజర్వేషన్లు ఇవ్వకపోగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా హింసించి, అవమానించారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క చోట కూడా అందుకు పూనుకోలేదు.
సమాజంలోని ప్రతి వర్గానికీ బోలెడు హామీలిచ్చారు. బీసీ కులాలన్నిటికి నిర్దిష్టమైన హామీలు కురిపించారు చంద్రబాబు. బీసీల అభివృద్ధే తన ధ్యేయమని ప్రచారం చేసుకున్నారు. కాని ఏ ఒక్కరికీ ఎటువంటి సాయమూ చేయలేదు. పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరకట్ట మీద అక్రమంగా నివసిస్తున్న ఆయన నివాసానికి నాయూ బ్రాహ్మణులు సమస్యలు పరిష్కారం కోసం వస్తే..వారి తోకలు కత్తిరిస్తానంటూ మీడియా ముందే హూంకరించారు. వారిని దారుణంగా అవమానించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి..ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా...వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలిస్తుంటే అనేక వందల ప్రాంతాల్లో కేసులు వేసి పేదల్ని నానారకాలుగా హింసించిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. అన్ని ఆటంకాలు అధిగమించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి, దాదాపు సగానికిపైగా పేదలకు ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు.
కోస్తా జిల్లాల్లో ఓడ రేవులు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ సముద్రంలో కలిసిపోయింది. ఒక్క పోర్టుకు కూడా పనులు ప్రారంభించకపోగా...పోర్టుల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకుని కేంద్రం ఇస్తానన్నదాన్ని కూడా కాలదన్నారు చంద్రబాబు. కాని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరో పది ఫిషింగ్ హార్బర్లు కూడా జగన్ నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీటి పథకం కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయి చంద్రబాబు మోసాల చిట్టాలో చేరిపోయంది.
ఈ విధంగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే నారా చంద్రబాబునాయుడు...2014లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలూగానూ చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారు. మళ్లీ ఈసారి కూడా అంతకంటే భారీ హామీలిస్తూ, వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నీ అమలు చేస్తానని నమ్మించే కుట్రలకు తెర తీస్తున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..అప నమ్మకానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ప్రజలందరికీ తెలుసు. అందుకే వైఎస్ జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నపుడు నువ్వు వచ్చి కొత్తగా మాకు చేసేదేంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?
Comments
Please login to add a commentAdd a comment